Mallareddy Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి మంత్రి మల్లారెడ్డి కోటి రూపాయలకుపైగా విరాళం..!

Mallareddy Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం స్వర్ణ తాపడం పనుల కోసం మంత్రి మల్లారెడ్డి కోటి రూపాయలకు పైగా నగదును కానుకగా ఇచ్చారు.

Update: 2021-10-28 09:30 GMT

Mallareddy Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం స్వర్ణ తాపడం పనుల కోసం మంత్రి మల్లారెడ్డి కోటి రూపాయలకు పైగా నగదును కానుకగా ఇచ్చారు. ఇవాళ భారీ సంఖ్యలో అనుచరులతో కలిసి గుట్టకు వెళ్లిన ఆయన.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత 3 కేజీల బంగారానికి సరిపడ డబ్బు విరాళంగా ఇచ్చారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి క్షేత్ర పునర్‌నిర్మాణంలో తాను కూడా పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని మల్లారెడ్డి అన్నారు. ఇప్పటికి ఇలా ప్రముఖులంతా విరాళంగా ఇచ్చిన బంగారం 40 కేజీల వరకూ చేరిందని అంచనా వేస్తున్నారు.

యాదాద్రి క్షేత్రానికి విరాళాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ ప్రముఖులు కూడా ఉడతాభక్తిగా కోట్లాది రూపాయల బంగారం, నగదు వితరణ చేశారు. సామాన్య భక్తులు కూడా పెద్ద సంఖ్యలో లక్ష్మీనరసింహస్వామికి కానుకలు సమర్పిస్తున్నారు. అటు, గోపురం బంగారు తాపడం కోసం ఆన్‌లైన్‌లో భక్తులు సమర్పిస్తున్న విరాళాలు కోటి 10 లక్షలకు చేరాయి.

ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం QR కోడ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్టు EO గీత తెలిపారు. భక్తులు ఈ QR కోడ్ స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లోనే స్వామివారికి కానుకలు సమర్పించవచ్చన్నారు. ఈ డబ్బంతా ఇండియన్‌ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందన్నారు. దీంతోపాటు ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీ ఆదాయం కూడా భారీగానే వస్తోంది. విదేశీ భక్తుల నుంచి కూడా విరాళాలు తీసుకునేందుకు ప్రత్యేకంగా అనుమతులు తీసుకుంటున్నారు ఆలయ అధికారులు.

యాదగిరిగుట్ట ఆలయాన్ని పునఃప్రారంభించేందుకు మహా కుంభ సంప్రోక్షణ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. చినజీయర్ స్వామి నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ చేస్తారు. దానికి వారం ముందు 108 కుండాలతో మహా సుదర్శన యాగం చేస్తారు. యాదాద్రి ఆలయం విమాన గోపురం తిరుమల తరహాలో స్వర్ణ తాపడం చేయించాలంటే అందుకు 125 కిలోల బంగారం అవసరం అవుతుందని లెక్క వేశారు. దీనికి తొలి విరాళంగా కేసీఆర్ కుటుంబం తరపున 1 కిలో 16 తులాలు ప్రకటించారు.

అలాగే చినజీయర్ పీఠం నుంచి కిలో బంగారం ఇస్తామన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖులంతా బంగారం సమర్పించేందుకు ముందుకు వచ్చారు. ఇవాళ మంత్రి మల్లారెడ్డి కూడా 1 కేజీ బంగారనికి సమానమైన నగదును స్వామివారికి సమర్పించారు. బంగారు తాపడానికి మొత్తం 65 కోట్ల రూపాయల వరకూ ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. 

Tags:    

Similar News