వైఎస్, జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నా: మంత్రి వేముల ప్రశాంత్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానంటూ మరోసారి స్టేట్‌మెంట్ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.;
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానంటూ మరోసారి స్టేట్‌మెంట్ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణకు వైఎస్ బద్ధవ్యతిరేకి కాదా అని ప్రశ్నించారు, తెలంగాణ ఇవ్వాలని సోనియాకు ఉన్నా.. వైఎస్ అడ్డుపడి తెలంగాణ బిడ్డల చావుకు కారణం కాలేదా అని కామెంట్ చేశారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించిన వైఎస్ నీటి దొంగ అయితే.. అంతకు రెట్టింపు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్న జగన్‌ను ఏమనాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి లిఫ్ట్‌ల ద్వారా రోజుకు 9 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని మరోసారి మండిపడ్డారు. కృష్ణా జలాల్లో నీటి వాటాలను త్వరగా తేల్చేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలని అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే ఆదేశాలను పాటించి, అక్రమ ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఆపాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిన్న మహబూబ్‌నగర్‌లో తాను చేసిన వ్యాఖ్యలు కేవలం పాలకులను ఉద్దేశించే తప్ప.. రాయలసీమ, ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి అనలేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్. ఆంధ్రప్రాంత ప్రజలపై విమర్శలు చేయడం టీఆర్‌ఎస్ విధానం కూడా కాదని స్పష్టత ఇచ్చారు. మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం రైతుల పొట్టగొట్టేలా అక్రమ ప్రాజెక్టులు కడుతున్న పాలకులను ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలు సైతం చేస్తామన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి.