MISS WORLS: మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమైన భాగ్యనగరం

మే 7 నుంచి 31 వరకూ మిస్ వరల్డ్ పోటీలు... తెలంగాణ సాంస్కృతిక వారసత్వం చాటేలా పోటీలు;

Update: 2025-04-29 09:15 GMT

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సుందరి పోటీ 'మిస్ వరల్డ్' 72వ ఎడిషన్‌కు తెలంగాణ వేదిక కాబోతుంది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, ఆధునికత ఉట్టిపడేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మిస్ వరల్డ్‌కు చెందిన గ్రాండ్ ఫైనల్‌తో పాటు ప్రారంభ, ముగింపు వేడుకలకు హైదరాబాద్ వేదిక కానుంది. మే 7 నుంచి 31 వరకూ జరిగే ఈ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు హైటెక్స్ వేదికగా జరగనుండగా ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సుమారు రూ.1.79 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. హైటెక్ సిటీ, చార్మినార్, ట్యాంక్ బండ్, సచివాలయం, దుర్గం చెరువు ప్రాంతాల్లో థీమ్ లైటింగ్, సెల్ఫీ పాయింట్లు, LED లైట్లు, ప్రపంచ సుందరి కిరీటం ఆకృతుల నిర్వహణకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళిక రచిస్తోంది.

 120 దేశాల సుందరీమణులు

'బ్యూటీ విత్ పర్పస్' అనే లక్ష్యంతో ఈ ప్రపంచ సుందరీ పోటీలను నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్ అత్యంత గుర్తింపు పొందిన హోదాగా నిలుస్తోంది. 120 దేశాలు, భూభాగాలకు చెందిన పోటీదార్లను ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి వేడుక ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. గౌరవప్రదమైన టైటిల్, కిరీటం కోసమే కాకుండా.. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌కు చెందిన 'బ్యూటీ విత్ పర్పస్' అనే లక్ష్యం కోసం ఈ వేడుకలో సుందరీ మణులు పోటీ పడుతారు. వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించే వారు, మే 4న తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌లో మే 31న జరిగే ఫైనల్ వేడుకలో, అంతకుముందు మిస్‌ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తన కిరీటాన్ని ప్రపంచ సుందరిగా గెలిచే వారికి అలంకరించనున్నారు. ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్రం.. 'తెలంగాణ, జరూర్ ఆనా : అందం తన నిజమైన అర్థాన్ని కనుగొనే చోటు' అనే పిలుపుతో ప్రపంచానికి ఆహ్వానం పంపుతోంది.

 సదావకాశంగా భావిస్తున్న తెలంగాణ

మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి ఒక మంచి అవకాశంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల ప్రతినిధులూ పాల్గొనే పోటీ కాబట్టి, తెలంగాణ టూరిజం, ఉత్పత్తులు, పెట్టుబడి అవకాశాలు వీటన్నింటినీ అతిథులు ముందు ఉంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ''ఇది తెలంగాణ పర్యటక రంగానికి చాలా గొప్ప అవకాశం. అందుకే దీన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకుంటూ భాగస్వాములం అవుతున్నాం. తెలంగాణ ఆహారం, ఆతిథ్యం, పర్యటక ప్రాంతాలు, చారిత్రక ప్రాంతాలు, చేనేత, పెట్టుబడులు.. ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను ముందు పెట్టడానికి ఈ వేడుకను ఒక అవకాశంగా తీసుకుంటాం.'' అని ఈ పోటీలకు ప్రభుత్వ సమన్వయకర్తగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు.

Tags:    

Similar News