NDSA: అసలు ఏం జరిగింది... ప్రశ్నల వర్షం
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించిన డ్యాం సేఫ్టీ బృందం.. కాళేశ్వరం ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం... అధికారుల తీరుపై అసహనం..;
కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన చేపట్టిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ రెండో రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీలను సందర్శించింది. ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీ సభ్యులు గురువారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి రాత్రి రామగుండంలో బస చేశారు. ఉదయం 10.30 గంటల సమయంలో అన్నారం బ్యారేజీకి చేరుకున్న కమిటీ సభ్యులు... దాదాపు 3 గంటల పాటు బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సుందిళ్ల బ్యారేజీకి చేరుకుని అక్కడ కూడా మూడు గంటలపాటు పరిశీలించి సమగ్ర వివరాలు సేకరించారు. ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఆపరేషన్ మాన్యువల్‌లో లోపాలు, ఏర్పడిన సమస్యలపై దృష్టి సారించారు.
అన్నారంలో బుంగలు ఎప్పుడు గుర్తించారనే అంశంతోపాటు.... అన్నారం బ్యారేజీ వద్ద 28, 38, 35, 48 పియర్ల వద్ద ఏర్పడిన నాలుగు బుంగలపై నిపుణుల కమిటీ ఆరా తీసింది. ఎప్పుడు గుర్తించారని ఇంజినీర్లను ప్రశ్నించింది. 2020 నుంచి బుంగలు పడుతూ వచ్చాయని వారు బదులిచ్చారు. 35వ పియర్ వద్ద పడిన పెద్ద గుంతకు చేపట్టిన కెమికల్ గ్రౌటింగ్‌పై నిపుణులు ప్రశ్నించారు. ఇంజినీర్లు 13 టన్నుల రసాయనాలు వినియోగించినట్లు చెప్పగా.. నిర్మాణ సంస్థ ప్రతినిధులు 7 టన్నులే వాడినట్లు చెప్పడంతో ఈ తేడా ఏమిటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వరదలకు సీసీ బ్లాక్స్ కొట్టుకుపోవడంపై వివరాలు తెలుసుకున్నారు. ఆపరేషన్ షెడ్యూల్ ఎవరిచ్చారని అడిగారు. పియర్స్ వద్ద వరద నీరు దిగువకు దూకే విధానానికి సంబంధించిన వివరాలు సేకరించారు. పియర్ల వద్ద వెంట్‌లు, గేట్లను పరిశీలించారు. పియర్లకు పగుళ్లు ఏమైనా ఏర్పడ్డాయా అని ఆరా తీశారు. బ్యారేజీకి సంబంధించిన డ్రాయింగ్స్, అండర్ కవర్ డ్రాయింగ్స్, డిజైన్లు తదితరమైనవాటిని ఇంజినీర్ల నుంచి తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణపైనా ఆరా తీశారు.
సుందిళ్ల బ్యారేజీ పునాదుల నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు వివిధ దశల్లో తీసిన ఫొటోలను ప్రాజెక్టు అధికారులు అక్కడ ప్రదర్శించగా నిపుణులు తిలకించారు. బ్యారేజీకి సంబంధించిన విషయాలను నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు వారికి నివేదించారు. కమిటీ సభ్యులు 50వ పియర్ వద్ద కాసేపు సీసీ బ్లాక్‌లతోపాటు ఆప్రాన్‌ల నాణ్యతను పరిశీలించారు. అప్‌అండ్‌డౌన్ స్ట్రీమ్‌లను వీక్షించి గతంలో వరదనీటి ఉద్ధృతితో అక్కడక్కడ దెబ్బతిన్న ఆప్రాన్‌ల వివరాలపై ఆరా తీశారు. 45, 46 పిల్లర్ల వద్ద గడ్డపార సాయంతో కొంతభాగం తవ్వి నమూనాలు సేకరించారు. ఇదే పిల్లర్ల మధ్య దాదాపు 20 నిమిషాల పాటు ఉండి చిత్రపటం సాయంతో సమగ్ర అధ్యయనం చేశారు. బ్యారేజీ గేట్ల మధ్య ఉన్న గైడ్‌వాల్స్ పనితీరుపై ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. పియర్ల నుంచి బ్యారేజీ గేట్ల వరకు అడుగు భాగాన నిర్మించిన సిమెంట్ రాఫ్ట్ డిజైన్లను పరిశీలించారు. కేవలం ప్రాజెక్టు మ్యాప్ ద్వారానే నీటి నిల్వ సామర్థ్యం, భవిష్యత్తులో వరద నీటి ప్రవాహాన్ని తట్టుకుంటుందా? లేదా? అనే విషయాలను చర్చించారు. వరదల మూలంగా బ్యారేజీ కుడివైపు ఉన్న మట్టి కరకట్టలు దెబ్బతిన్న విషయంపై ఆరా తీశారు.