ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల భవన నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ భవనాలకు ప్రభుత్వం శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొందుర్గులో సమీకృత గురుకుల పాఠశాల భవన భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇతర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శంకుస్థాపన ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయం నుంచి ఆయా జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన నిర్వహించారు. రెండో దశలో ఇతర ప్రాంతాల్లో భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని సీఎస్ చెప్పారు.