రేవంత్ పాలనలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారనేదానిపై క్లారిటీ లేకున్నా..యాడ్ ఆన్ పై మాత్రం స్పష్టత రానుంది. రేషన్‌కార్డుల్లో అర్హులైన కొత్త కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది.ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశం కొలిక్కి రాగానే రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే దానిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. రేషన్ కార్డుల్లో అర్హుల పేర్లను చేర్చాలని రాష్ట్రంలో లక్షల కుటుంబాలు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి. తొలుత ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వచ్చాక.. ప్రస్తుత రేషన్ కార్డులు, అందులోని లబ్ధిదారుల సమాచారం అంతా అందులో చేరిపోయేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. అర్హత కలిగిన కుటుంబ సభ్యులను చేర్చే దరఖాస్తుల్ని పరిశీలించి ఆమోదిస్తే.. వారి సమాచారం కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో చేరిపోతుందని పౌరసరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో త్వరలోనే రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే దానిపై స్పష్టత రానుంది.