ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాపాలన, గ్రామసభలు, మీసేవ, కులగణనలో అప్లై చేసుకున్న అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎమెల్సీ కోడ్ అమల్లో లేని జిల్లాలో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం ఆదేశించింది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నిజామా బాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో లేదు. సీఎం ఆదేశాలతో ఈ మూడు జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ కానుంది. త్వరగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. అదే సమయంలో.. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అధికారులు తేల్చి చెబుతున్నారు. కులగణన, ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు నాలుగు రకాలుగా దరఖాస్తులు స్వీకరించామని, అర్హులైన వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డు కోసం ఒకసారి దరఖాస్తు చేసుకుంటే చాలని, పదే దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.