తెలంగాణ పోలీసులు తనను ఏ తప్పూ చేయకున్నా అరెస్ట్ చేశాని బీఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ కొణతం దిలీప్ చెప్పారు. సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. హైడ్రా, మూసీ సుందరీకరణ, లగచర్ల ఘటనలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ.. సర్కారును అప్రదిష్టపాలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరైన దిలీప్ వాంగ్మూలాన్ని ప్రభుత్వం నమోదు చేసుకుంది. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నప్పటికీ పోలీసులు బేఖాతర్ చేస్తున్నారని దిలీప్ విమర్శించారు. పోలీసులు ఏం కేసు పెట్టారో వారికే అర్థం కావడం లేదన్నారు. పోలీసులు దిలీప్‌ను బలవంతంగా కారులో ఎక్కించి, న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులు అందజేసిన రిమాండ్ రిపోర్టును పరిశీలించిన మెజిస్ట్రేట్ రిమాండ్‌ను తిరస్కరించారు.