TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
డిమాండ్లు నెరవేరే కొనసాగుతుందన్న ఆర్టీసీ నేతలు
తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి తాజాగా జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. గతేడాది సమ్మె చేసేందుకు రెడీ అయిన ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ హామీతో వెనక్కి తగ్గారు. తమ సమస్యలను పరిష్కరించుకునే వరకు ఈసారి సమ్మెను విరమించకూడదని ఆర్టీసీ కార్మిక సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈసారి ఎలాంటి పరిస్థితుల్లో డిమాండ్లను సాధించుకునే వరకు వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్జికి.. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. రెండు వారాల్లోపు ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప్పదని నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సమ్మె తేదీపై రెండు వారాల తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.
కీలక డిమాండ్లు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న వేళ.. ఆ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రధానంగా డిమాండ్ చేశారు. అదే సమంయలో 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులకు పేర్కొన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.350 కోట్లను ఎలాంటి కోతలు లేకుండా ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన రూ.2,500 కోట్ల పాత పెండింగ్ బకాయిలను తక్షణమే రిలీజ్ చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అదే సమయంలో ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లపై ప్రభుత్వం గతంలో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి.. వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులపై ప్రస్తుతం ఉన్న అధిక పనిభారాన్ని తగ్గించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక జేఏసీ నేతలు.. తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.