Palamuru Politics : పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతల తీరు రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిందా?

Palamuru Politics : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన సొంత జిల్లాలోనే నేతల తీరు తలనొప్పిగా మారిందా?

Update: 2022-02-18 06:15 GMT

Palamuru Politics : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన సొంత జిల్లాలోనే నేతల తీరు తలనొప్పిగా మారిందా? పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ఎదుటే బాహా బాహీకి దిగడంతో విభేదాలు బయటపడ్డాయా? మరో నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య అంతర్గత పోరు రచ్చ కెక్కిందా? అసలు ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? నేతల తీరు మారకపోవడం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి?

ఉమ్మడి పాలమూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. అలాంటి జిల్లాలో హస్తం పార్టీ తన వైభవాన్ని క్రమక్రమంగా కోల్పోతూ వస్తోంది. ఎన్నికల్లో పరాజయాలతో నేతలు, కార్యకర్తలు డీలా పడిపోయారు. ఇలాంటి సమయంలో టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపించింది. రేవంత్ రాకతో పార్టీ కొంతమేర బలపడిందట. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు కూడా క్రియాశీలకంగా మారిపోయారట. కానీ పార్టీలో ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు పార్టీ అధినేత రేవంత్ రెడ్డికి మింగుడు పడడం లేదట.

ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందట. ఇటీవలే జడ్చర్లలో చేపట్టిన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పార్టీకి నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత తలనొప్పి తెచ్చిపెట్టిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. దీంతో పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారే అవకాశం ఉందని నాయకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో సీటు కోసం నేతలు పావులు కదుపుతుండడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని రెండు వర్గాలు తమ బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాయి. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. కార్యక్రమానికి హాజరైన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ నరేందర్ రెడ్డి సమక్షంలోనే ఇరువర్గాల అనుచరులు బాహా బాహీకి దిగడం పార్టీలో హాట్ టాపిక్ అయింది. దీంతో ఆగ్రహించిన నరేందర్ రెడ్డి... గొడవకు దిగినవారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పిసిసి అధ్యక్షుడికి సూచించారట. దీంతో జడ్చర్లలో దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ తలనొప్పి ఇలా ఉండగానే.... మరోవైపు దేవరకద్ర నియోజకవర్గంలో కూడా నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కిందట. ఇక్కడి నాయకులు మధుసూదన్ రెడ్డి, ప్రదీప్ గౌడ్, ప్రశాంత్ రెడ్డిల మధ్య విభేదాలు బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఏ కార్యక్రమమైనా ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక నాయకుడి అనుచరుడు... మరో నాయకుడిని కించపరుస్తూ మాట్లాడడంతో గొడవ మొదలైనట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. దీంతో పార్టీకి చెందిన ఓ బడా నాయకుడు రంగప్రవేశం చేసి ఇద్దరినీ సముదాయించడంతో వివాదం సద్దుమణిగిందట.

కలిసి కార్యక్రమాలు చేసుకోవాలని ఆ నాయకుడు ఇద్దరినీ పురమాయించారట. అయినాసరే వారి తీరు మాత్రం మారడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పంచాయతీ రేవంత్ రెడ్డి వద్దకు చేరిందట. చివరికి ఇది రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో మూడుముక్కలాట కొనసాగుతుండడంతో క్యాడర్ కూడా టెన్షన్ పడుతోందట. మరి ఈ వ్యవహారాలన్నీ రేవంత్ రెడ్డి ఎలా చక్క పెడతాడో చూడాలి.

Tags:    

Similar News