సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం దుర్మార్గం అని మండిపడ్డారు. అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గం..మహాపచారం అన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ఏ మతానికి సంబంధించిన వారైనా సామూహికంగా కాపాడుకోవాలని సూచించారు. ఈ బాధ్యతను ప్రభుత్వాలు మీదనో, పోలీసుల మీదనో వేసి మనం బాధ్యత నుంచి దూరంగా ఉండరాదని ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్.
ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూశానన్నారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలను అపవిత్రం చేయడం అలవాటుగా మారిందన్నారు. ఇలాంటి సంఘటనలను చూసీ చూడనట్లు వదిలేస్తే అది విపరీత పోకడలకు దారి తీస్తుంది.. అదుపు తప్పుతుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గాలపై చాలా కఠిన చర్యలు అవసరమన్నారు.