PEDDA GATTU: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె
భారీగా తరలివస్తున్న భక్తులు... ఈ నెల 20 వరకు ఆంక్షలు;
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట శ్రీ లింగమంతులస్వామి జాతర వైభవంగా కొనసాగుతోంది. పెద్దగట్టు జాతరలో కీలకఘట్టమైర దేవరపెట్టెకు సాంప్రదాయం ప్రకారం కేసారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసారం గ్రామంలో మెంతబోయిన, మున్న వంశస్థులు, బైకానులు దేవరపెట్టెలోని దేవతామూర్తులైన లింగమంతులస్వామి, గంగమ్మ, ఆకుమంచమ్మ, యలమంచమ్మ, చౌడమ్మల బొమ్మలను గుడ్డలతో తుడిచి పలుసు, కుంకుమతో బొట్టు పెట్టి బంతి పూలదండలతో అలంకరించారు. కుల పెద్దలు దూప, దీపారాధన చేసి కొబ్బరికాయలు కొట్టి పరమాన్నం నైవేద్యంగా పెట్టి, మొక్కి దేవరపెట్టెను ఓ లింగా…ఓ లింగా అంటూ కదిలించారు. అనంతరం ఆ దేవరపెట్టెను ఊరేగింపుగా దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు జాతర జరిగే చోటుకు చేర్చారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు పెద్దగట్టుకు తరలి వస్తున్నారు.
పెట్టెలో ఏముంది..
దేవరపెట్టెలో లింగమంతులస్వామి, 33మంది దేవతలు ఉంటారు. చౌడమ్మ, గంగమ్మ, యలమంచమ్మ, ఆకుమంచమ్మ, మాణిక్యమ్మ, ఐదుగురు చొప్పున రాజులు, చెంచులతో పాటు భూమినేడు, భూమసాని, వినా యకుడు, బ్రహ్మ, వరాహుడు, బొల్లావు, గొల్ల భామ, వసుదేవుడు, శ్రీకృష్ణుడు, పులి, భైరవుడు, పోతరాజు, బ్రాహ్మణుడు, నారథుడు, విశ్వామిత్రుడు, పాపనాక్షి, నాగేంద్రుడు ఉంటారు. దీంతో శ్రీ లింగమంతుల స్వామి జాతర ప్రారంభమైందని నిర్వాహకులు వెల్లడించారు.
ఈ 20 వరకు ట్రాఫిక్ మళ్లింపులు
పెద్దగట్టు జాతర ప్రారంభం కావడంతో హైదరాబాద్- విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతాయని కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కోదాడ వద్ద మళ్లిస్తున్నట్లు చెప్పారు. కోదాడ సమీపంలోని బాలాజీ నగర్ ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ మళ్లించి అటు నుంచి హుజుర్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు వాహనాలను పంపుతారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు కోదాడ వద్ద జాతీయ రహదారితో కలవనున్నాయి. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నుంచి నల్గొండ అటునుంచి మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడల మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు.