బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని, సభకు రాని ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొన్ని నెలలుగా ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం లేదని, ఇలా సమావేశాలకు హాజరు కాకుంటే చట్టప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చన్నారు. దీనిపై తాము జోక్యం చేసుకోవచ్చా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. పిల్‌కు అర్హత లేదని అసెంబ్లీ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు వినిపించేందుకు పిటిషనర్ గడువు కోరడంతో 2 వారాలకు వాయిదా పడింది.