PINK BOOK: పింక్ బుక్ సిద్ధమవుతోందా..?
ఏపీలో రెడ్ బుక్ తరహాలో తెలంగాణలో పింక్ బుక్;
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు ముందు టీడీపీ నేత నారా లోకేశ్.. రెడ్ బుక్ పేరు ఎత్తారు. తమను వేధించిన వారి పేర్లు ఈ రెడ్ బుక్‌లో రాస్తున్నామని... అధికారంలోకి వచ్చాక ఆ రెడ్‌బుక్‌లో ఉన్న పేర్ల ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ లబోదిబోమంటోంది. ఇప్పుడు ఇదే రెడ్ బుక్, గుడ్ బుక్ లాగా బీఆర్ఎస్ కూడా ఓ పింక్ బుక్‌ని రెడీ చేసుకోవాలనుకుంటోందా? అందులో తమను ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు రాయాలనుకుంటోందా? అంటే అవుననే మాటలే వినివిస్తున్నాయి. ఇటీవల ప్రతిపక్షాలకు బ్యూరోక్రాట్స్ కూడా టార్గెట్ అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని తాజా పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. ఆ క్రమంలోనే… ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో లబ్దిదారులకు రేషన్ కార్డులు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ కమిషనర్, ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహన్, జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన పాల్గొన్నారు. అయితే… వాళ్లు ప్రోగ్రామ్‌లో వాళ్ళు చేసిన ప్రసంగాలు వివాదాస్పదం అయ్యాయి.
సివిల్ సప్లయ్స్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ మాట్లాడిన మాటల్ని తప్పు పట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ హయాంలో… రేషన్ కార్డులే ఇవ్వలేదంటూ కొందరు ఐఏఎస్ లు అబద్ధాలు చెబుతున్నారని, వారి హోదాకు రాజకీయాలు మాట్లాడడం తగదని కేటీఆర్ అన్నారాయన. మరో రెండున్నరేళ్లలో తాము తిరిగి అధికారంలోకి వస్తామని, అప్పుడు అందరి లెక్కలు సరి చేస్తామని హెచ్చరించారు కూడా. పోలీసులు సైతం అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటిస్తూ.. బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యానికి దిగుతున్నారని, ఇది ఎంతో కాలం నడవదన్నారు కేటీఆర్. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి.కేటీఆర్ వ్యాఖ్యలతో పింక్ బుక్ రెడీ అవుతోందని.. దాంట్లో అధికారుల పేర్లు రాస్తున్నారన్న చర్చ జరుగుతోంది.