TG : తెలంగాణ సర్కారుపై ప్లానింగ్ కమిషన్ ప్రశంసలు

Update: 2024-09-11 08:45 GMT

కేంద్ర నిధుల విషయంలో మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని, దీనికి బదులు తమకు ప్రోత్సాహకం అందించాలని, పన్నులవాటా 50 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా హైదరాబాద్ లో బుధవారం తెలిపారు. 15వ ఆర్థిక సంఘం ఇలాంటి రాష్ట్రాలకు డివిజబుల్ పూల్లోని 1 శాతం నిధులివ్వాలని సిఫారసు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ఆయా రంగాలకు ప్రత్యేకంగా సిఫారసు చేసిన గ్రాంట్లు మాత్రమే రాలేదని, అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు పనగారియా. ప్రభుత్వంతోపాటు పలు పార్టీల ప్రతినిధుల నుంచీ తాము సలహాలు, సూచనలు స్వీకరించామని వివరించారు. తమ సిఫార్సులను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందే తప్ప, విధిగా అమలు చేసేలా కేంద్రాన్ని తమ కమిషన్ శాసించలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ప్రజాభవన్ వేదికగా జరిగిన 16వ ఆర్థిక సంఘం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రుణాల రీ స్ట్రక్చరింగ్ లేదా అదనపు రుణాలకు అవకాశం ఇవ్వాలని, సెస్, సర్చార్జీల్లోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని, ఆ అంశంపై అధ్యయనం చేస్తామని తెలిపారు. ఆర్థిక స్థితిగతులు సహా అన్ని అంశాలను కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం వివరించిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు బాగున్నాయంటూ ఈ సందర్భంగా పనగారియా ప్రశంసించారు.

Tags:    

Similar News