TAPPING: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ఛార్జ్‌ షీట్‌ దాఖలు

ఆరుగురిని నిందితులుగా చేర్చిన పోలీసులు... ప్రధాన నిందితుడు ఇంటెలిజెన్స్‌ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు;

Update: 2024-06-12 03:00 GMT

కలకలం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం నాంపల్లి కోర్టులో ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసింది. 68 పేజీల అభియోగ పత్రంలో ఆరుగురిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. 69 మందిని సాక్షులుగా చేర్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇంటెలిజెన్స్‌ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, ఆరవ నిందితుడు శ్రవణ్‌రావు పరారీలో ఉన్నట్టు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు నాంపల్లి న్యాయస్థానంలో నేరాభియోగ పత్రం దాఖలు చేశారు. 68 పేజీల చార్జ్‌షీట్‌లో పోలీసులు మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చగా... వీరిలో ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు పరారీలో ఉన్నట్టు సస్పెండైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీసీ రాధాకిషన్‌రావు... సస్పెండైన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్‌లో ఉన్నట్టు చార్జ్‌షీట్‌లో వివరించారు.

69 మంది సాక్షుల వాంగ్మూలాలను అభియోగపత్రంలో నమోదు చేశారు. వీరిలో గతంలో ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పోలీసు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారు. వేలాది పేజీల్లో అభియోగాలను బలపరిచే పత్రాలు పొందుపరిచారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలుండడంతో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. మరో వైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను విచారించాక మరిన్ని ఆధారాలతో అభియోగపత్రం దాఖలు చేయనున్నట్టు తెలిపారు.

ఎస్‌ఐబీలో ఆధారాలు ధ్వంసమయ్యాయని ఆ విభాగం అదనపు ఎస్పీ రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదుతో.. మార్చ్‌ 10 న పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి బాధ్యుడిగా పేర్కొంటూ ఎస్‌ఐబీలో పనిచేసే డీఎస్పీ ప్రణీత్‌రావును సస్పెండ్‌ చేశారు. మార్చ్‌ 13 న అతన్ని అరెస్టు చేశారు. అతన్ని విచారించిన సందర్భంలో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. కేసు కీలకంగా మారడంతో పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు అధికారిగా జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరిని దర్యాప్తు అధికారిగా నియమించారు. ఇతర నిందితుల పాత్రపైన ఆధారాలు లభించడంతో... వారిని కూడా అరెస్టు చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో నాలుగు నెలలు పాటు దాదాపు 1200 ఫోన్లను నిందితులు ట్యాప్‌ చేసినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. భారాసను గెలిపించడం కోసమే ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో నిందితులు ట్యాపింగ్‌ చేసినట్టు తేలింది. రాజకీయ నేతలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లను నిందితులు ట్యాప్‌ చేసినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది.

Tags:    

Similar News