సంగారెడ్డి జైల్లో గుండెపోటుకు గురైన రైతు హీర్యా నాయక్‌ను బేడీలు వేసి వైద్య పరీక్షలకు తీసుకురావడం వివాదంగా మారింది. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారులను ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు.
లగచర్ల ఘటనలో అరెస్టైన రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నెల రోజులుగా 40 మంది జైలులో మగ్గుతున్నారని తెలిపారు. జైలులో ఉన్న రైతుకు నిన్న గుండె నొప్పి వచ్చిందని, ఆ విషయాన్ని బయటకు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. గుండెనొప్పి వచ్చిన వ్యక్తికి బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకురావడం దారుణమన్నారు కేటీఆర్.