Telangana: తెలంగాణలో పొలిటికల్ హీట్.. ఎలక్షన్ మూడ్‌లోకి అన్నీ పార్టీలు..
Telangana: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కితీరుతామని పదే పదే చెబుతున్న బీజేపీ నేతలు.. ఆ దిశగా అడుగులు కాదు.. పరుగులు పెట్టేందుకు ప్లాన్ రెడీ చేసుకుంది.
Telangana: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.. అన్నీ పార్టీలు ఎలక్షన్ మూడ్ లోకి వెళుతున్నాయి.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కితీరుతామని పదే పదే చెబుతున్న బీజేపీ నేతలు.. ఆ దిశగా అడుగులు కాదు.. పరుగులు పెట్టేందుకు ప్లాన్ రెడీ చేసుకుంది. బద్లా తప్పదంటూ హెచ్చరికలు చేస్తున్నారు.ఇప్పటి వరకు జిల్లాలకు ఇంచార్జ్లు ఉన్నప్పటికీ.. వారిపై మరింత దూకుడుగా వ్యవహరించేలా పాలక్ లను నియమించింది.
ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాలను గమనిస్తే.. ఇక.. పరుగులేనా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.పాలక్ పదవిలో ఉన్న ఆ సీనియర్ నేతనే అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిస్తారు. అక్కడ పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక వనరులు సమకూర్చడం, పార్టీ క్యాడర్ బాగోగులు చూడడం వంటి ముఖ్య విషయాలపై దృష్టి సారిస్తారు. నెలలో మూడు రోజుల పాటు ఆ నియోజకవర్గంలోనే మకాం వేస్తారు. అక్కడ పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీకి నివేదిస్తారు. రెండు రోజుల కీలక సమావేశాలు బీజేపీ రాష్ట్ర కేడర్‌లో కొత్త జోష్‌ను తీసుకువస్తాయని పలువురు నేతలు అంటున్నారు.
మరోవైపు ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మొదటిసారి స్పందించారు. తనపై ఆరోపణలు చేసినవాళ్లు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పరోక్షంగా కేసీఆర్‌ను ఆయన హెచ్చరించారు.నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో నేనంటే ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు నా పేరును పాపులర్ చేశారు. నాపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని, తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలకు సరైన టైంలో సరైన జవాబిస్తానని క్లారిటీఇచ్చారు.
మరోవైపు బీఆర్‌ఎస్ కూడా తన స్టైల్‌లో ఎలక్షన్‌కు రెడీ అవుతోంది.. సంక్షేమ పధకాలే తమకు శ్రీరామ రక్ష అంటూ.. ముందుకు వెళుతుంది. జాతీయ పార్టీగా రూపాంతరం చెందాక రైతు విభాగం అధ్యక్షుడిని కూడా నియమించి అయనతోనే రాష్ట్రంలో అమలు అవుతున్న పధకాలపై స్టేట్‌మెంట్‌లు ఇప్పిస్తోంది.. పెండింగ్‌లో ఉన్న పధకాలను పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తోంది.ఓ వైపు పార్టీలో పెరుగుతున్న అసమ్మతిని కంట్రోల్ చేసుకుంటూ.. మరోవైపు ప్రత్యర్ధి పార్టీలను టార్గెట్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది గులాబీ పార్టీ.
రాష్ట్రంలో వీక్ గా ఉన్న అసెంబ్లీ సీట్లను గుర్తించిన నాయకత్వం.. అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో అన్నీ వర్గాల భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారట కేసీఆర్. సో.. బీఆర్‌ఎస్ కూడా ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అవుతుందని పొలిటికల్ అనలిస్ట్‌లు అంటున్నారు.
ఇక నిత్యం అంతర్గత విభేదాలతో స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ కూడా ఎన్నికల కోసం సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది..కల్వకుంట్ల రాజ్యంలో తెలంగాణ కనుమరుగు అంటూ ఫైర్ అవుతుంది. కొత్తగా వేసిన కమిటీలు రచ్చకు దారి తీయగా.. AICC దూతగా వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చల్లార్చి వెళ్లారు.. అంతే కాదు ఎన్నికలను ఎదుర్కోడానికి ఐదు అంశాలతో ఓ రిపోర్ట్‌ను రెడీ చేసి హైకమాండ్ చేతికి ఇచ్చారట.. నేతలు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడటంతో కేడర్‌లో జోష్ వస్తుందన్న డిగ్గీరాజా ఆ దిశగా కార్యక్రమాలను ప్లాన్ చేయాలని టీ కాంగ్ నేతకు హైకమాండ్‌తో క్లాస్ ఇప్పించనున్నారట.. సీనియర్లకు పీసీసీ నేతకు మధ్య అగాధాన్ని పూడ్చేందుకు AICC స్థాయి కమిటీని కూడా నియమించే పనిలో ఉంది హస్తం పార్టీ అంతే కాదు అవసరమైతే పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ను కూడా మార్చి సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించే పనిలో పడింది..
మరోవైపు తెలంగాణలో ఇన్నాళ్లూ స్తబ్ధుగా ఉన్న టీడీపీ క్యాడర్‌ను ఉత్సాహపరిచే చర్యలు చేపట్టారు చంద్రబాబు. తెలంగాణలో పార్టీ పుంజుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖమ్మంలో పర్యటించి భారీ సభ నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు పార్టీ అభిమానులు కూడా తరలివచ్చారు. తెలంగాణలో టీడీపీని క్రియాశీలకంగా చేయాలని పిలుపు నివ్వడమే కాదు ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉందని సంచలన వ్యాఖ్య చేశారు. ఇదే సమయంలో ఆయన ఘర్ వాపసీ పాలసీ ప్రకటించారు. పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి టీడీపీలోకికి రావాలని పిలుపునిచ్చారు. ఇదే జరిగితే తెలంగాణలో జరిగే ఎన్నికల రణక్షేత్రంలో టీడీపీ కూడా కీలక పాత్ర పోషించనుంది.