POLITICS: తెలంగాణ రాజకీయ తెరపై "బీసీ" పోరు
‘బీసీ’ల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం;
తెలంగాణ రాజకీయ తెరమీద ‘బలహీన వర్గాలు’ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయమంతా ‘బీసీ’ల చుట్టూ తిరుగుతోంది. బీసీలు తెలంగాణలో బహుళ సంఖ్యాకులని కులగణన తేల్చడంతో... ఓటుబ్యాంకు రాజకీయం ఒక్కసారిగా ఒళ్లు విరుచుకుంది. బీసీ రిజర్వేషన్ బిల్లు, 50 శాతం రిజర్వేషన్ క్యాప్ తొలగించే ఆర్డినెన్స్‌తో కాంగ్రెస్ ‘ఎజెండా సెట్’ చేసింది. లోగడ రిజర్వేషన్ తగ్గింపు నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంది. ‘బీసీ సీఎం’, రిజర్వేషన్లకు మద్దతు అంటూ బీజేపీ కూడా స్వరం వినిపిస్తోంది. దీంతో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా వేడెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వంముందడుగు వేస్తోంది. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి వంటి రాజకీయ పక్షాలు, సంస్థలు విభిన్న వైఖరులతో రంగంలోకి దిగాయి. ఈ వివాదాస్పద అంశంపై ప్రతి పక్షం తమదైన వాదనలతో పోటీపడుతోంది.
ఢిల్లీలో కాంగ్రెస్ పోరు
కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఢిల్లీలో పోరాటానికి దిగింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పిస్తే.. ఆ రెండు పార్టీలు మోకాలడ్డేస్తున్నాయని ముఖ్యమంత్రి కూడా ఫైర్ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామంటే.. గుజరాత్ వాళ్లకు వచ్చిన కడుపునొప్పేంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో మేం బిల్లులు ఆమోదిస్తే.. మా బిల్లును తుంగలో తొక్కే హక్కు మీకు ఎవరిచ్చారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మోడీకి ఆలోచన లేదు సరే.. ఆయన మోచేతి నీళ్లు తాగే తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాం చందర్ రావులకు ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు మోడీ మోచేతి నీళ్లు తాగొచ్చు. మరీ బీఆర్ఎస్కు ఏమైంది.. మీరు కూడా మోడీ చెప్పులు మోస్తారా..? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కేంద్రంలో పాలకపక్షంగా ఉండి... బిల్లు, ఆర్డినెన్స్ ఆమోదంలో జరుగుతున్న ప్రస్తుత జాప్యానికి ఇరుకునపడింది. స్థానిక సంస్థలఎన్నికలు ముంచుకొస్తున్నవేళ... ఈ రాజకీయ స్పర్ధ ఎవరిని ముంచుతుంది? మరెవరిని తేలుస్తుంది? అన్నది వారి విశ్వసనీయత,ప్రజాదరణబట్టి తేలాల్సిందే. తెలంగాణలో సామాజిక న్యాయరాగంతో సోషల్ ఇంజినీరింగ్‌కు ప్రాధాన్యత పెరిగింది. అధికార కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీవరకు బీసీ పాట పాడుతుంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ జాగృతి కూడా బీసీ గళమెత్తుకున్నాయి. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తమపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు యత్నిస్తోంది. సోషల్ ఇంజినీరింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయి.
బీఆర్ఎస్కు కష్టాలు
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను లోగడ 34 నుంచి 23 శాతానికి తగ్గించి ఆ వర్గాలకు బీఆర్ఎస్ రాజకీయంగా అన్యాయం చేసిందని, ఇప్పుడు కూడా 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని కాంగ్రెస్ ఆ పార్టీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. బీఆర్ఎస్ కు ఒక్క కాంగ్రెస్ వైపు నుంచి ఒత్తిడే కాకుండా తెలంగాణ జాగృతి నుంచి కూడా బీసీ విషయంలో ఇంటిపోరు పెరిగింది. వెనుకబడకూడదని బీఆర్ఎస్ కూడా బీసీ బాట పట్టింది.
కవిత బీసీ నినాదం
బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉంటున్న కవిత బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్‌తో సమానంగా బీఆర్ఎస్ నూ చికాకుపర్చారు. భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డా సామాజిక తెలంగాణ రాలేదని ఆమె చేసిన ప్రకటనతో బీఆర్ఎస్లో గందరగోళానికి గురైంది. తెలంగాణ జాగృతి పేరున బీసీ నినాదంతో భారీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కవిత చేపట్టిన ఒత్తిడి చర్యలతో బీఆర్ఎస్కూ ఇబ్బందులు తప్పలేదు. ఆమె బీసీ సంఘాల నేతలతో జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించిన కవిత ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే, బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, వామపక్ష నేతలను కలుసుకున్నారు. ఇప్పటికిప్పుడు బిల్లుకు చట్టబద్ధత అవకాశాలు లేని దశలో, ఆర్డినెన్స్ పై గవర్నర్ నిర్ణయంపైనే ఆసక్తి నెలకొంది. నిర్ణయం ఎలా ఉన్నా రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశమే కీలక ఎజెండాగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.