TS : పోల్ అలర్ట్.. తెలంగాణలో అదనపు సెలవు

Update: 2024-03-23 07:34 GMT

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తో ఎలక్షన్ కమిషన్ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. లోక్‌సభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో లోక్‌సభ స్థానాలతో పాటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక వేళ కీలక ప్రకటన చేసింది.

మే 13న సోమవారం తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించునేందుకు వీలు కల్పిస్తూ ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా తెలంగాణ కార్మిక శాఖ ప్రకటించింది. ఎన్నికల సంఘం ఏప్రిల్‌ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకి ఏప్రిల్ 25వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29వ తేదీగా ప్రకటించారు.

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉపఎన్నికకు మే 13న పోలింగ్ జరగనుంది. ఇక ఫలితాలు దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలతో పాటే జూన్‌ 4వ తేదీన వెలువడుతాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రకటించారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News