జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 50.18 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం నెమ్మదిగా ప్రారంభమైన ఓటింగ్.. మధ్యాహ్నం తర్వాత వేగం అందుకుంది. చివరికి సాయంత్రం వరకు ఓటర్లు బాగా స్పందించి సగటు కంటే మెరుగైన పోలింగ్ నమోదు చేశారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత జూబ్లీహిల్స్‌లో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బీఆర్‌ఎస్ నాయకులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్ చేశారని, కొంతమంది బూత్‌లలో రిగ్గింగ్ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఆమెతో పాటు బీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా నిరసనలు తెలుపుతున్నారు.
అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం అన్ని ఆరోపణలను ఖండిస్తున్నారు. తాము ఎలాంటి రిగ్గింగ్ కు పాల్పడలేదని.. “జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈసారి గెలుపు కాంగ్రెస్‌దే అవుతుంది” అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం సైలెంట్‌గా ఉంటూ, ఫలితాల వరకు ఎలాంటి పెద్ద వ్యాఖ్యలు చేయకుండా పరిస్థితిని గమనిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ 14న జరిగే ఫలితాలపై నిలిచింది. ఎవరి ప్రచారం ప్రజల మనసులో ఎక్కువగా ముద్ర వేసిందో, జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరిని నమ్మారో ఆ రోజు తేలనుంది. అయితే అప్పుడే కొన్ని ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. ఇందులో కొన్ని కాంగ్రెస్ వైపు ఉన్నాయి.
నవీన్ యాదవ్ గెలుస్తాడని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కానీ బీఆర్ ఎస్ మాత్రం తమదే గెలుపు అంటోంది. మొత్తానికి, తక్కువ పోలింగ్ శాతం ఉన్నప్పటికీ, జూబ్లీహిల్స్ ఫలితం ఈసారి రాజకీయంగా పెద్ద చర్చగా మారబోతోంది. బీఆర్ ఎస్ కు సిట్టింగ్ సీటు కాబట్టి వదులుకోవద్దని గట్టిగానే ప్రయత్నం చేసింది. అటు కాంగ్రెస్ కూడా గెలిచి తమ మీద వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలని అనుకుంది. ఈ లెక్కన 14న వచ్చే రిజల్ట్ జూబ్లీహిల్స్ కుర్చీ ఎవరిదో తేల్చబోతోంది.