PUSHPA: విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి

బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్న వైద్యులు... పరామర్శించిన పోలీస్ కమిషనర్;

Update: 2024-12-18 01:00 GMT

పుష్ప-2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. రోజు రోజుకూ జ్వరం పెరుగుతోందన్నారు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందడం లేదని.. బాలుడిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. చికిత్స ఖర్చులూ భరిస్తానని, ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.


పరామర్శించిన సీపీ

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను నగర కమిషనర్ CV ఆనంద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్​కు షోకాజ్​ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. థియేటర్​ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలన్నారు. సంధ్య థియేటర్​ తొక్కిసలాట ఘటనపై థియేటర్​ యాజమాన్యాన్ని వివరణ కోరారు. బాలుడి బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని తెలిపారు.

సంధ్య థియేటర్‌కు షోకాజ్‌ నోటీసులు

సంధ్య థియేటర్‌కు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. తాజాగా థియేటర్‌ యాజమాన్యానికి హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4న సంధ్య థియేటర్‌లో నిర్వహించిన పుష్ప2 బెనిఫిట్ షోలో మహిళ మృతికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణమైనప్పుడు ఎందుకు లైసెన్స్ రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. పుష్ప2 ఘటనలో సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైన విషయం తెలిసిందే.

సంధ్య థియేటర్ ఇక క్లోజేనా..?

సంధ్య థియేటర్ నిర్వహణ లోపాలపై వివరణ ఇవ్వాలంటూ పోలీసులు షోకాజ్ నోటీసు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మహిళ మరణానికి దారి తీసిన ఘటన నేపథ్యంలో సినిమాటోగ్రఫీ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని అడిగారు. 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. థియేటర్ నిర్వహణలో పోలీసులు పలు లోపాలను గమనించారు. తాజా నోటీసులతో థియేటర్ క్లోజేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News