తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఆవర్తనం ఒకటి కేంద్రీకృతమైందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక రేపు ఉమ్మడి నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేశారు.