RAIN: హైదరాబాద్‌లో కుండపోత.. కొట్టుకుపోయిన మామ అల్లుడు
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు... పరిశీలించిన మేయర్
హైదరాబాద్ తడిసి ముద్దయింది. రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ వర్షం ధాటికి హబీబ్‌నగర్‌లోని అఫ్జల్‌సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు. డ్రైనేజీలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా గల్లంతయ్యాడు. వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అలాగే, ముషీరాబాద్‌లో ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. ముషీరాబాద్ డివిజన్ వినోబా కాలనీకి చెందిన సన్నీ (26) రాత్రి 9.30 గంటల సమయంలో స్థానికంగా ఉన్న నాలా పక్కన ఉన్న గోడపై స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా గోడ కూలిపోయింది. దీంతో ఆ యువకుడు నాళాలో పడి కొట్టుకుపోయాడు. వెంటనే అతని స్నేహితులు తాడుతో రక్షించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ముషీరాబాద్‌లో అత్యధిక వర్షపాతం
డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) ప్రకారం, ఆదివారం రాత్రి 8:30 గంటల నుండి రాత్రి 11 గంటల మధ్య అత్యధిక వర్షపాతం ముషీరాబాద్‌లోని బౌద్ధ నగర్ కమ్యూనిటీ హాల్‌లో 124 మి.మీ.గా నమోదైంది. ఆ తర్వాత, ఎంసీహెచ్ కాలనీలో 118.5 మి.మీ., జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో 114.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
మేయర్ పర్యవేక్షణ
అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షానికి నగరంలోని చాలా రోడ్లు చెరువులను తలపించాయి. ట్రాఫిక్ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి నీటిని తొలగించే పనులు చేపట్టారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి బంజారా హిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని పర్యవేక్షించారు. "బంజారా హిల్స్ రోడ్డు నెం.12 వద్ద భారీగా చేరిన వర్షపు నీటిని తొలగించడానికి జీహెచ్‌ఎంసీ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నాం. నీటిని త్వరగా బయటికి పంపించడానికి మరిన్ని మోటార్ పంపులను వాడాలని అధికారులకు సూచించాను" అని ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు.