బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

Rain Alerts: తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

Update: 2021-07-17 07:07 GMT

Heavy rains file Image 

Rain Alerts: తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో..ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశులున్నట్లు తెలిపిన వాతావరణశాఖ...మరో 4 రోజుల అనంతరం మళ్లీ వర్షాలు పెరిగే సూచనలున్నట్లు స్పష్టం చేసింది. 

నిన్నటి వరకు కురిసిన వర్షాలతో హైదరాబాద్‌ నగరంలో జంట జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. నేడో, రేపో గేట్లు అధికారులు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నగర వాసుల నీటి కష్టాలు తీరనున్నాయి. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా... ప్రస్తుతం 1784.24 అడుగులకు చేరింది. అటు హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా... ప్రస్తుత 1762.20 అడుగులుగా కొనసాగుతోంది.

మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో అధికారులు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన భారీ వర్షాలతో పులిచింతల ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 173.29 అడుగులకు చేరింది.. అటు జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.750 మీటర్లకు చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి పూర్తి నీటినిల్వ 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.53 టీఎంసీలుగా కొనసాగుతోంది.

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 7,454 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5,188 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా....ఇప్పటి వరకు 312 అడుగులకు చేరింది. మరోవైపు మూసీ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులకు చేరగా...ప్రస్తుత నీటి మట్టం 638 అడుగులకు చేరింది.

ఏపీలో కురుస్తున్న వర్షాలకు ఆనకట్టలు, డ్యామ్‌లలోకి భారీగా నీరు చేరుతోంది. కర్ణాటకలో ఎగువన కురుస్తున్న భారీవర్షాలకు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరదప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 36 వేల 750 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 7వేల 63 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 809.60 అడుగులకు చేరింది. మరోవైపు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

అటు రాజమహేంద్రవరం ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. 0.50 అడుగులకు పెరిగింది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 8,200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి. పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పునరావాస కాలనీలు, మైదాన ప్రాంతాలకు ముంపు గ్రామాల ప్రజలు తరలిపోతున్నారు.

ఈ నెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌, గ్రామీణం, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్‌, కరీంనగర్‌, కామారెడ్డి, జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోని చిత్తూరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News