బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం కారణంగా ఉత్తరాది జిల్లాల్లో మినహా మిగతా చోట్ల చలి ప్రభావం కాస్త తగ్గింది. మరోవైపు నిన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండలో వర్షాలు కురిశాయి.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ బలహీనపడుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంది. కాగా బంగాళాఖాతంలో 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.