RAINS: చెరువులను తలపిస్తున్న హైదరాబాద్ రోడ్లు
నీటిలో మునిగి వ్యక్తి మృతి
హైదరాబాద్‌పై మరోసారి వరుణుడు విరుచుకుపడ్డాడు. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు కురిసిన వర్షానికి నగరజీవులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రికార్డుస్థాయిలో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. క్షణాల్లో రోడ్లు చెరువులుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముషిరాబాద్ 15 సెం. మీ, మోండామోర్కెట్‌లో 13 సెం. మీ వర్షం కురిసింది. ఇప్పటికీ ప్రధాన రహదారులపై వరద ప్రవహిస్తూనే ఉంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సనత్‌నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, సుచిత్ర, గండి మైసమ్మ, దుండిగల్, కాప్రా, ఏఎస్‌రావు నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. యూసుఫ్‌గూడా కృష్ణానగర్ బీ బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, పిల్లలు ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై నీరు నిల్వ ఉండటంతో మోటార్‌సైకిళ్లు, ఆటోలు నిలిచిపోవడం, కార్లు స్తంభించడం వంటి సమస్యలు చోటుచేసుకున్నాయి.
వ్యక్తి మృతి
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం నగరవాసులకు కాళ రాత్రిని మిగిల్చింది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బల్కంపేటకు చెందిన షరపుద్దీన్ అనే యువకుడు వర్షపు నీటిలో మునిగి మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అండర్ పాస్ వద్ద భారీగా నీరు చేరగా.. బైక్‌పై వెళ్తున్న షరపుద్దీన్ కొట్టుకుపోయాడు. స్థానికులు స్పందించి రక్షించేందుకు ప్రయత్నించారు. సీపీఆర్ చేసినా షరపుద్దీన్ ప్రాణాలు దక్కలేదు.
నేడు కూడా భారీ వర్షాలు
తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది.