Kamineni Hospitals : కామినేని హాస్పిటల్స్ లో అరుదైన శస్త్రచికిత్స

Update: 2025-07-15 07:30 GMT

అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సను కామినేని హాస్పిటల్స్ లో విజయవంతంగా నిర్వహించారు. ప్రఖ్యాత చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పి. సునీల్ కుమార్ సాధించిన ఈ విజయం కామినేని విజయప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.ఆర్.ఎస్. వర్ధన్ పేర్కొన్నారు. అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా, సదరు చికిత్స వివరాలను తెలియజేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్లో సోమవారం జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ ఎన్.ఆర్.ఎస్. వర్ధన్ మాట్లాడుతూ.. సాధారణంగా ఈ తరహా కేసుల్లో శస్త్రచికిత్స అనంతరం పేషెంట్ కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని తెలిపారు. అయితే, డాక్టర్ సునీల్ కుమార్ అద్భుత నైపుణ్యం ఫలితంగా కేవలం 21 రోజుల్లోనే పేషెంట్ సాధారణ స్థితికి చేరుకోవడం అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చని అన్నారు. అతి సంక్లిష్టమైన శస్త్రచికిత్సను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించి విజయం సాధించిన డాక్టర్ సునీల్ కుమార్ అభినందనీయులని అన్నారు. ఈ విజయం కామినేని కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం, ఈఎన్టీ శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. “రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు కామినేని న్యూరాలజీ విభాగంలో అడ్మిట్ అయ్యాడు. చికిత్స కొనసాగుతుండగా, మూడు రోజుల తర్వాత పేషెంట్ ఆరోగ్య పరిస్థితిలో కొన్ని మార్పులు సంభవించాయి. ముఖం వంకర పోవడం, కనురెప్పల్లో కదలిక లేకపోవడం వంటి లక్షణాలను పేషెంట్లో గుర్తించాం. ప్రమాదానికి గురైనప్పుడు చెవి వెనుక భాగంలోని టెంపోరల్ బోన్ దెబ్బతింది. దెబ్బతిన్న ఈ ఎముక ముఖ భాగానికి సంబంధించిన కీలక నరాన్ని నొక్కివేయడంతో రోగికి పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ పరిస్థితిని ట్రొమాటిక్ ఫేషియల్ నెర్వ్ పాల్సీగా వ్యవహరిస్తాం. అత్యంత సంక్లిష్టమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు అత్యంత కచ్చితత్వంతో శస్త్రచికిత్స నిర్వహించాల్సివుంటుంది. స్వల్ప తేడాలున్నా శస్త్రచికిత్స సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. దాదాపు నాలుగు గంటలు పైగా శ్రమించి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశాం. దెబ్బతిన్న ఎముకను సరిచేసి, ఒత్తిడికి గురవుతున్న నరాన్ని సాధారణ స్థితికి తీసుకురాగలిగాం. ఈ తరహా కేసుల్లో రోగులు కోలుకుని సాధారణ స్థితికి చేరుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. కానీ, అత్యంత కచ్చితత్వంతో సర్జరీ నిర్వహించడం ద్వారా 21 రోజుల్లోనే పేషెంట్ పూర్తిగా సాధారణ స్థితికి వచ్చారు” అని తెలిపారు. ఇటువంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సను అత్యంత ప్రభావవంతంగా పూర్తి చేయడం, పేషెంట్ అతి తక్కువ వ్యవధిలోనే సాధారణ స్థితికి చేరుకోవడం తమ కృషికి దక్కిన గొప్ప విజయంగా డాక్టర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. కామినేని హాస్పిటల్స్ నందు అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులతో కూడిన వివిధ వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా కామినేని హాస్పిటల్స్ కృషి చేస్తోందని డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించారు.

Tags:    

Similar News