TS: పేదల సుదీర్ఘ నిరీక్షణకు తెర
జనవరి 26 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం... అభ్యంతరాల తర్వాత తుది జాబితా;
తెలంగాణలో పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా పౌరసరఫరాలశాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. జనవరి 26న రేషన్ కార్డుల జారీ ప్రారంభం అవుతుంది.
వడబోత తర్వాతే రేషన్ కార్డులు
రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఆరోగ్య శ్రీ, రూ.500కు గ్యాస్ సిలిండర్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ఆధారం. దీంతో రేషన్‌కార్డుకు డిమాండ్ బాగా పెరిగింది. గతంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుని పరిశీలించే వారు. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పద్ధతిని అనుసరిస్తోంది. గత నవంబరులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఎంపిక ఉండనుంది. ఆ సర్వే ద్వారా రేషన్‌కార్డులు లేనివారి వివరాలను పౌరసరఫరాల శాఖ తీసుకుంది. కొత్త కార్డులు కావాలన్నవారి, ఇప్పటికే ఉన్నకార్డుల్లో పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నవారి సమాచారాన్ని అధికారులు వడబోశారు. ఈ ప్రక్రియ తర్వాత 6,68,309 కుటుంబాలు కొత్త కార్డులకు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ కుటుంబాల్లో 11,65,052 మంది పేర్లు ఉన్నాయి. గ్రామ, బస్తీ సభల తర్వాత కొత్త కార్డులు... అందులో లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రాథమిక జాబితా ప్రకారం హైదరాబాద్‌లో అత్యధికంగా 83,285, వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 6,647 కుటుంబాలకు కార్డులు వచ్చే అవకాశం ఉంది.
రేవంత్, ఉత్తమ్ సంతకాలతో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతకాలతో కూడిన లేఖ రూపంలో కొత్త కార్డులు ఇస్తారు. కొంతకాలం తర్వాత పాతవారికి, కొత్తవారికి కొత్త రూపంలో రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ వర్గాల సమాచారం.