REVANTH: సానుభూతితో ఓట్లు దండుకునే యత్నం
బీఆర్ఎస్పై ముఖ్యమంత్రి రేవంత్ ఫైర్.. జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొన్న సీఎం.. కేసీఆర్, బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు
బీఆరెస్ పార్టీ సానుభూతితో ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. బీఆరెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఓటర్లుగా మూడుసార్లు భారత రాష్ట్ర సమితికి అవకాశమిచ్చి మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారు. పేదప్రజలకు ఆయన ఎలాంటి సేవలు అందించలేదు. నాకు మంచి స్నేహితుడైనప్పటికీ ఒక్కసారి కూడా నియోజకవర్గానికి నిధులు కావాలని శాసనసభలో అడగలేదు. రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలంటూ ఎప్పుడూ లేఖ కూడా ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరు నవీన్ యాదవ్‌కు 30 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయాన్ని అందించండి. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఆయన ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తారు. ఒక్కసారి అవకాశం ఇస్తే రూ.వందల కోట్ల నిధులు తీసుకొస్తాం. అభివృద్ధి పనులన్నింటినీ నేను దగ్గరుండి చేయిస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక సందర్భంగా మాగంటి సునీతను గెలిపించాలని భారత రాష్ట్ర సమితి నాయకులు సానుభూతి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సొంత ఆడబిడ్డను కుటుంబం నుంచి, పార్టీ నుంచి వెలివేసిన కేటీఆర్, హరీశ్‌రావు మాయమాటలు చెబుతున్నారు." అని అన్నారు.
కేసీఆర్ దుర్మార్గుడు
గతంలో పాటించిన రాజకీయ సంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘సెంటిమెంట్ పేరుతో బీఆరెస్ నేతలు మీ ముందుకు వస్తున్నారు. అయితే, 2007లో పీజేఆర్ గారు ఆకస్మికంగా చనిపోతే, ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాల్సింది పోయి, అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్. ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని మూడు గంటలు బయట నిలబెట్టి కేసీఆర్ అవమానించాడు. పీజేఆర్ కుటుంబంపై పోటీ పెట్టి సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది కేసీఆర్. కారు షెడ్డుకు పోయిందని ఇప్పుడు బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మైనారిటీలకు మేలు జరుగుతుందని, మీ బిడ్డ నవీన్ యాదవ్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యేగా నవీన్, మంత్రిగా అజారుద్దీన్ మీకు అండగా ఉంటారు. నవీన్‌ను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే మీకెందుకు ఇబ్బంది ఏంటని రేవంత్ బీజేపీ నేతలను నిలదీశారు. మైనార్టీల ఓట్లు మీకు రావని.. భారత రాష్ట్ర సమితికి ఓట్లు వేయించేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
"కేటీఆర్‌పై సుమోటోగా కేసు పెట్టాలి"
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పది సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో, ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం తగదని ఆయన విమర్శించారు. “ఓటు కి 5 వేల రూపాయలు అడుక్కోండి అని చెప్పడం అక్షేపణీయం” అని వ్యాఖ్యానించిన ఆయన, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… “హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు ఆరు వేలు ఇచ్చిన సంస్కృతి కేటీఆర్‌దే. ఇప్పుడు అదే పద్ధతిలో జూబ్లీహిల్స్‌లో ప్రయత్నిస్తున్నారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన కలిగినవారు. వారు డబ్బు రాజకీయాలకు లోనుకావు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాదిరిగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తారు” అని విశ్వాసం వ్యక్తం చేశారు.