REVANTH: కేసీఆర్ మారుతాడని అనుకున్నా... కానీ
ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మారుతారని ఆశించానని, కానీ ఎలాంటి మార్పులు రాలేదని, మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతం గురించి పచ్చి అసత్యాలు చెబుతున్నారని సీరియస్ అయ్యారు.కేసీఆర్ ఇప్పటికైనా బయటకు రావడం చాలా సంతోషకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన విమర్శలపై స్పందిస్తూ, ఉమ్మడి రాష్ట్రం కన్నా కేసీఆర్ హయాంలోనే నీటి వాటాల విషయంలో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని చెప్పారు. చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, అబద్ధాలనే పెట్టుబడిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
“811 టీఎంసీల నికర జలాల్లో 299 టీఎంసీలు చాలని సంతకం చేసింది కేసీఆరే. నీటి వాటాలపై సంతకం చేసి మూడు జిల్లాలకు మరణ శాసనం రాశారు. కృష్ణా జలాల్లో 71 శాతం వాటా కావాలని మేము కొట్లాడుతున్నాం. ఏపీ జలదోపిడీకి దోహదం చేసింది కేసీఆరే. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదు. కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని కేసీఆర్ అడగలేకపోయారు. కృష్ణా, గోదావరి జలాల వాటాలపై జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం. కేసీఆర్, కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు. అసెంబ్లీ సమావేశాలకు రావాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిపక్ష నేత బయటకు రావడాన్ని స్వాగతిస్తున్నాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణకు కేసీఆర్ చేసిన మేలు కంటే అన్యాయమే ఎక్కువ చేశారని సీఎం వ్యాఖ్యానించారు. ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. వచ్చే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతామని, దమ్ముంటే కేసీఆర్ సమావేశాలకు రావాలని అన్నారు. ఎవరేం చేశారో సభలోనే చర్చిద్దామని చెప్పారు. కలుగులోంచి ఎలుక బయటకు వచ్చినట్లు కేసీఆర్ బయటకు వచ్చారని, ప్రభుత్వం పై అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.