REVANTH: నాకేం సంబంధం లేదు
అమిత్ షా వీడియోలను మార్ఫింగ్ , ఆ వీడియో వ్యాప్తిపై రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ;
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోలను మార్ఫింగ్ , ఆ వీడియో వ్యాప్తితో.. తనకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు రేవంత్ రెడ్డి సమాధానం పంపారు. ఢిల్లీ పోలీసులు.. తనకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్న INC-తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడంలేదని రేవంత్ రెడ్డి తరపున సమాధానాన్ని న్యాయవాది సౌమ్య గుప్తా దిల్లీ పోలీసులకు ఇచ్చారు కేవలం CMO తెలంగాణ సహా తన వ్యక్తిగత ఖాతాలు మాత్రమే తనకు ఉన్నాయని,వాటిని మాత్రమే తాను వినియోగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి.. దిల్లీ పోలీసులకు పంపిన సమాధానంలో పేర్కొన్నారు. మరోవైపు దిల్లీ పోలీసుల నోటీసులు అందుకున్న PCCసామాజిక మీడియా ఛైర్మన్ మన్నేసతీష్ , ఇతర నాయకులు నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్ ..... నోటీసులకు సమాధానాలు ఇచ్చేందుకు రెండు వారాలు గడువు కోరినట్టు TPCC లీగల్ సెల్ తెలిపింది.
రిజర్వేషన్ల రద్దుకే బీజేపీ కుట్ర
రిజర్వేషన్ల రద్దు, హిందూ దేశం అనేవి RSS మూల సిద్ధాంతాలని... ఆ దిశగానే మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వెంకటాచలయ్య కమిషన్ ఏర్పాటు, రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ నేతల ప్రకటనలే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఇదే అంశంపై తాను మాట్లాడితే దిల్లీ పోలీసులను బెదిరింపులకు పాల్పడుతున్నారన్న రేవంత్‌రెడ్డి బీజేపీ కుట్రలను తిప్పికొడతానని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశం దుమారం రేపుతున్న వేళ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి బీజేపీ పై ఆరోపణలు చేశారు. ఈ అంశంపై పలుసందర్భాల్లో బీజేపీ వైఖరిని ప్రస్తావించిన సీఎం... RSS సిద్ధాంతాన్ని అమలుచేసేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
ఇప్పటికే 370 ఆర్టికల్ రద్దు, త్రిబుల్‌తలాక్, CAAలాంటి వాటిని అమల్లోకి తెచ్చారన్న రేవంత్‌రెడ్డి... ఇక రిజర్వేషన్ల రద్దుపై మోదీ, అమిత్‌షా దృష్టి సారించారన్నారు. వాజ్‌పేయి హయాంలో వెంకటాచలయ్య కమిషన్ ఏర్పాటు చేసినా... 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో రిజర్వేషన్ల రద్దు ఆగిపోయిందన్నారు.
రిజర్వేషన్ల అంశంపై RSS ప్రముఖులు, బీజేపీనేతలు చేసిన ప్రకటనలను, మండల్ కమిషన్ నివేదిక అమలుపై వైఖరిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ఆ పార్టీ నేతల వ్యాఖ్యానాలే నిదర్శనంగా CM పేర్కొన్నారు..
రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను సవరించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ రావాలని.... రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ400 సీట్లు గెలవాలని చూస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీన్ని తాను ప్రశ్నిస్తే దిల్లీ పోలీసుల నుంచి నోటీసులు పంపించారని విమర్శించారు. వెంకటాచలయ్య నివేదికపై బీజేపీవైఖరి స్పష్టతనివ్వాలన్న ముఖ్యమంత్రి... ఆ పార్టీకి వేసే ప్రతి ఓటూ రిజర్వేషన్ల రద్దుకే దారితీస్తుందని సీఎం హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడే బాధ్యత తమపై ఉందన్న సీఎం రేవంత్‌రెడ్డి... మోదీ, అమిత్‌షా పోలీసులతో తనను బెదిరించాలని చూసినా భయపడేదిలేదన్నారు.