Revanth Reddy : మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ బహిరంగ లేఖ

Revanth Reddy : హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారని, 8 ఏళ్లుగా అధికారంలో ఉన్నా.. ఈ హామీ నెరవేర్చలేదన్నారు.

Update: 2022-02-02 07:45 GMT

Revanth Reddy : మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారని, 8 ఏళ్లుగా అధికారంలో ఉన్నా.. ఈ హామీ నెరవేర్చలేదన్నారు. కనీసం కాలుష్యం లేని నగరంగా కూడా చేయలేకపోయారన్నారు. మహానగరం సంగతి అటుంచితే.. కనీసం జవహార్‌ నగర్‌ డంపింగ్‌యార్డ్‌ విషయంలో కూడా మీ హామీ నెరవేరలేదని లేఖలో తెలిపారు. మూడేళ్ల క్రితం.. ఇక్కడినుంచి డంపింగ్‌ యార్డ్‌ మారుస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. కల్వకుంట్ల వారి మాటలు కోటలు దాటుతాయ్‌ కానీ.. పనులు గడప దాటవన్న నానుడి మరోసారి రుజువు చేసుకున్నారన్నారు.

తన పార్లమెంట్‌ పరిధిలోని జవహార్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ వల్ల విషవాయువులు వెలువడి ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందన్నారు. భూగర్బ జలాలు కూడా కలుషితమవుతున్నాయని జాయింట్‌ ఆక్షన్‌ కమిటీ అనేక సార్లు చెప్పిందని గుర్తు చేశారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఇచ్చిన హామీని సైతం పక్కనపెట్టి మొద్దు నిద్రపోతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు రేవంత్‌రెడ్డి. ప్రజలు స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం కోరుకుంటున్నారని, అవి కూడా ఇవ్వలేని మీరు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా వెంటనే జవహార్‌ నగర్‌ డంప్‌ యార్డ్‌ను తరలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు రేవంత్‌రెడ్డి.

Tags:    

Similar News