సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ తన ఉద్దేశాలను స్పష్టంగా మరోసారి చాటారు. తాను ఫామ్ హౌజ్ సీఎంను కాదని.. పనిచేసే సీఎంను అని కేసీఆర్ కు కౌంటరిచ్చారు. "తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఇదే హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైంది. తెలంగాణ అంటే త్యాగం... ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. ఆ నాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నా. తెలంగాణ ప్రజలకు ‘‘ప్రజా పాలన దినోత్సవ’’ శుభాకాంక్షలు." అని సీఎం రేవంత్ చెప్పారు.
"సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ఈ శుభదినాన్ని ఎలా నిర్వచించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం. స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావించింది. అందుకే... ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ... ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా నామకరణం చేశాం..
ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష... వారి ఆలోచన. ఇది నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి. మనం జాగ్రత్తగా గమనిస్తే... తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. పిడికిలి పోరాటానికి సింబల్. తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది. ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ 17ను కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం క్షమించరాని విషయం. ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి.... ఇది ఎప్పటికీ అలాగే ఉండాలి. పెత్తందార్లపై, నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి" అని సీఎం చెప్పారు.