REVANTH: తెలంగాణకు మరణ శాసనంలా ఆ ఇద్దరి సంతకాలు

ఉత్తమ్ ప్రజంటేషన్‌కు హాజరైన సీఎం రేవంత్... సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ కీలక వ్యాఖ్యలు.. జల వివాదంతో లబ్ధి పొందాలని కేసీఆర్ వ్యూహం

Update: 2026-01-02 03:00 GMT

సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అండ్ కో తమ ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లే ప్రధాన కారణమని తెలిపారు. బీఆర్ఎస్ నేతలది సంకుతిత స్వభావమని విమర్శించారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలోని పదేళ్లలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.నదీ జలాల అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ ప్రజంటేషన్‌కు హాజరై ప్రసంగించారు. నీటి హక్కుల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని.. కానీ, గత పదేళ్లుగా నీటి విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ప్రజాభవన్‌లో కృష్ణా, గోదావరి బేసిన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఆయన హాజరయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి జలాల విషయంలో సంకుచిత స్వభావంతో తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని కామెంట్ చేశారు. ఇక ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని.. ప్రజలకు వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. గతంలో కేసీఆర్, హరీశ్‌రావు చేసిన సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నీటి చౌర్యం చేస్తున్న.. తెలంగాణ వాటాను మనం వాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ఆ ప్రాజెక్టును మార్చారని మండిపడ్డారు. తల వదిలేసి తోక దగ్గర నీళ్లు తెచ్చేలా ప్రాజెక్టు డిజైన్ చేశారని విమర్శించారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల ఒప్పందాన్ని కేసీఆర్ చేశారని ఆరోపణలు చేశారు. ఏపీకి 66శాతం నీళ్లు శాశ్వత హక్కు వచ్చేలా కేసీఆర్ సంతకం చేశారని ధ్వజమెత్తారు.

కేసీఆర్‍కు మంత్రి ఉత్తమ్ కౌంటర్

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై బీఆర్ఎస్‍వి తప్పుడు ప్రచారాలు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డివిమర్శించారు. ప్రజా భవన్‍లో కృష్ణా, గోదావరి బేసిన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు తాము 90 శాతం పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా విస్మరించిందని చేసిన ఆరోపణలను ఖండించారు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ.80 వేల కోట్లు అవసరం అని అలాంటిది ఈ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టుపై రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా అని ఉత్తమ్ ప్రశ్నించారు.

Tags:    

Similar News