REVANTH: ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది
జూబ్లీహిల్స్ ప్రజా తీర్పుపై రేవంత్ హర్షం.. నియోజకవర్గ ఓటర్లకు సీఎం ధన్యవాదాలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం కృషి చేసిన అందరికీ రేవంత్ కృతజ్ఞతలు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లకు ధన్యవాదాలు చెప్పారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు సరైన ఫలితాలు రాలేదు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్‌పై క్రమంగా నమ్మకం పెరుగుతోందని అన్నారు. గెలుపోటములకు కాంగ్రెస్ ఎప్పుడూ కుంగిపోదు.. పొంగిపోదు అని చెప్పారు. ప్రజల తరపున నిలబడటం, పోరాడటమే కాంగ్రెస్ కర్తవ్యం అని అన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి.. జూబ్లీహిల్స్‌లో తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ నేతలు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆదాయంలో 65 శాతం వరకు హైదరాబాద్ నుంచే వస్తోందని.. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎవరి పాత్ర వాళ్లం పోషిద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనార్టీల్లో మరింత పట్టుకోసం పోలింగ్‌కు కొద్దిరోజుల ముందే అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు.
కాంగ్రెస్ కర్తవ్యం పోరాటం
”ప్రజల తరపున నిలబడటం, పోరాడటమే కాంగ్రెస్ కర్తవ్యం. రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పు ఇచ్చారు. రాష్ట్ర ఆదాయంలో 65శాతం వరకు జంట నగరాల నుంచే వస్తోంది. ఈ నగరాల ఆదాయాన్నే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు వాడుతున్నాం. హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మరింత అభివృద్ధి చేస్తాం. 2023 ఎలక్షన్ తర్వాత నుంచి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్ల శాతం పెరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయంతో కాంగ్రెస్ కు బలం పెరిగింది. సోషల్ మీడియాలో విషప్రచారం చేశారని రేవంత్ అన్నారు. ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. హరీశ్ రావు అసూయ, కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. హైడ్రా, ఈగల్ వంటి సంస్థలు హైదరాబాద్ అభివృద్ధి కోసమే తెచ్చినట్లు తెలిపారు. కానీ వాటిపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టి మరీ తప్పుడు ప్రచారం చేసింది.. ప్రజలు వాస్తవాన్ని గుర్తించి ఓటు వేశారని అన్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం ఇకనైనా బీఆర్ఎస్ నేతలు ఆపాలని అన్నారు.
సంక్షేమానికి పట్టం కట్టారు: టీపీసీసీ చీఫ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 25 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగరవేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు. ఈ విజయం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అంకితం. జూబ్లీహిల్స్ తీర్పుతో ప్రజలు BRS పార్టీకి సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో ఆ పార్టీకి చోటులేదని మరోసారి రుజువైంది. రానున్న రోజుల్లోనూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతుంది. నవీన్‌ను గెలిపించిన ఘనత.. సీఎం, మంత్రులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది’’ అని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.