REVANTH: మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన... ఫేజ్ 2,ఫేజ్ 3 పనులకు రేవంత్ భూమిపూజ... హైదరాబాద్ ప్రజల దాహార్తీ తీర్చేందుకే పథకం
హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికే గోదావరి తాగునీటి పథకం తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వరద నియంత్రణ కోసమే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారని అన్నారు. తాగునీటి సమస్యలు పరిష్కరించడానికే పీజేఆర్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా.. ఉస్మాన్‌సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. గోదావరి జలాలను హైదరాబాద్ కు మల్లన్నసాగర్ నుంచి తీసుకురావడం లేదని.. శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తీసుకొస్తామని రేవంత్ వెల్లడించారు. తాటి చెట్టులా పెరిగినా హరీశ్ రావుకు బుద్ధి పెరగలేదని తీవ్రంగా మండిపడ్డారు. ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. రూ.7,360 కోట్లతో హ్యామ్ విధానంలో ఈ పనులు చేపట్టనున్నామన్న రేవంత్... రెండేళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని అన్నారు. సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. తాగునీరు అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నదిని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఏడాదే గోదావరి ఫేజ్ 2, 3 పనులు ప్రారంభిద్దాం అనుకున్నా కొందరు అడ్డుకున్నారని.. గోదావరి ఫేజ్ 2, 3 ద్వారా 20 టీఎంసీల నీటిని తీసుకువస్తాం అని చెప్పారు. 2014 నుంచి బీఆర్ఎస్ ఒక్క చుక్క నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదని, తాము మరలా అధికారంలోకి వచ్చాక గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు చేసి ముందుకెళ్తున్నామన్నారు.
ప్రజల దాహార్తిని తీర్చుతాం
‘గోదావరి నదీ జలాలను మూసీ నది, ఈసా నదిలో సమ్మేళనం చేసి నగర ప్రజల దాహార్తిని తీర్చుతాం. హైద్రాబాద్ నగరంకు ప్రపంచ దేశాల్లో గొప్ప పేరుంది. 1908లో నగర ప్రమాదాన్ని నివారించడానికి నిజాం సర్కార్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించారు. ప్రపంచంలోనే గొప్ప ఇంజినీర్లతో నిజాం సర్కార్ ఈ ప్రాజెక్టులు కట్టింది. దూరదృష్టితో ఆలోచించి ఈ ప్రాజెక్టులు కట్టడంతో నగర దాహం తీరుతోంది. నగరంలో జనాభా పెరుగుతోంది, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తున్నారు. నగర జనాభా కోటిన్నరకు చేరింది. పీజేఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఖాళీ కుండలతో అసెంబ్లీ ముందు ధర్నాలు చేసి.. మంజీరా, కృష్ణా జలాలను హైదరాబాద్ తరలించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు శ్రీపాద ఎల్లంపల్లి నీటిని తరలించడానికి శంకుస్థాపన చేస్తే 2014 నుంచి నగరానికి వచ్చాయి’ అని సీఎం రేవంత్ తెలిపారు.
పీజేఆర్ పోరాటంతోనే...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎండకాలం వచ్చిందంటే సచివాలయం ముందు నిసరనలు హోరెత్తేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు పీజేఆర్ పోరాటంతోనే మంజీరా జలాలు నగరానికి వచ్చాయని గుర్తు చేశారు. 2002లో కృష్ణా జలాలు హైదరాబాద్‌కు తరలించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ హయాంలో శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నగరానికి తరలించారని పేర్కొన్నారు. గోదావరి తలపైన చల్లుకున్నంత మాత్రాన.. చేసిన పాపాలు పోవని మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి సెటైర్లు వేశారు. హైదరాబాద్ దాహం తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరి నదీ జలాలను మూసీ నది, ఈసా నదిలో సమ్మేళనం చేసి నగర ప్రజల దాహార్తిని తీర్చుతామన్నారు. హైద్రాబాద్ నగరంకు ప్రపంచ దేశాల్లో గొప్ప పేరుందని... 1908లో నగర ప్రమాదాన్ని నివారించడానికి నిజాం సర్కార్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించారు. మూసీ నది మురికి కూపంగానే ఉండాలని అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గంగా, యమునా, సబర్మతీ నదులు మాత్రమే ప్రక్షాళన కావాలా..? అని కేంద్రాన్ని నిలదీశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ మూసీ ప్రక్షాళన గురించి ఎందుకు ఆలోచించలేదని అన్నారు.