REVANTH: ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తాం
తెలంగాణలో మరో రెండు ఎయిర్‌పోర్టులు.. సన్న బియ్యం పథకం ఓ సంచలనం.. స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి;
మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రపంచ నగరాలతో పోటీపడే నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నామని.. పేదల సంక్షేమంలో సరికొత్త చరిత్ర రాస్తున్నామని అన్నారు. సంక్షేమానికి కేరాఫ్ అంటే కాంగ్రెస్ పాలన అని తెలిపారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయపతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్న రేవంత్.. సన్న బియ్యం పథకం కేవలం ఆకలితీర్చే పథకం కాదని... పేదల ఆత్మగౌరవానికి ప్రతీకని అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే పేదల సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్న సీఎం... రేషన్‌షాపులు పేదవాడి ఆకలితీర్చే భరోసా కేంద్రాలుగా మారాయన్నారు. గతేడాది ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టామన్న ముఖ్యమంత్రి రేవంత్... రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని... విత్తనాలు వేసే నాటికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేశామన్నారు.
మూసీ పునరుజ్జీవంతో...
" మూసీ పునరుజ్జీవనంతో హైదరాబాద్ వరదకు పరిష్కారం చూపుతాం. హైదరాబాద్ గేట్ వేతో తెలంగాణ ముఖచిత్రాన్ని చాటిచెప్తాం. బాపూఘాట్‌ను గాంధీ సరోవర్ పేరుతో అభివృద్ధి చేస్తాం. మనకు శంషాబాద్ విమానాశ్రయం ఒక్కటే ఉంది. త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్‌కు కొత్త ఎయిర్‌పోర్టులు రానున్నాయి. హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో కీలక ప్రాజెక్టులు నిర్మిస్తాం. హైదరాబాద్‌ను శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా మారుస్తాం. శుభ్రమైన నగరమే లక్ష్యంగా ఏర్పాటు చేసిందే హైడ్రా వ్యవస్థ” అని రేవంత్ తెలిపారు.