KCR: కేసీఆర్ వందేళ్లు చల్లగా ఉండాలి: రేవంత్
రోజా చేపల పులుసుకు కేసీఆర్ న్యాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శ;
తనను అనని మాటలు అన్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారని.. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్ట్రెచర్ నుంచి మార్చురీకి వెళ్తుందని బీఆర్ఎస్ గురించి ప్రస్తావిస్తే.. ఆ వ్యాఖ్యలు కేసీఆర్ గురించి చేశానని తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వందేళ్లు చల్లగా ప్రతిపక్షంలోనే ఉండాలని... తాను అధికార పక్షంలోనే ఉండాలని రేవంత్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలను నివారించేందుకు గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61కి పెంచిందని ఆరోపించారు. ఇప్పుడు వారంతా రిటైర్ అవుతున్న కారణంగా 2025-26 ఆర్థిక ఏడాది ముగిసేలోగా ఆయా బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని ఆయన శాసనమండలిలో స్పష్టం చేశారు. ఉద్యోగులకు ప్రతి నెలా 1న జీతాలు ఇవ్వడమే సవాలుగా మారిందని సీఎం పేర్కొన్నారు.
బట్టలూడదీసి కొడతారు జాగ్రత్త
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతుంటే చాలా బాధ కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. అందుకే పౌరులందరూ బాధ్యతగా స్పందించాలని అన్నారు. సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. జర్నలిజం ముసుగులో కొందరు వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్నారని.. ఈ విషయం ప్రజలకు పార్టీ కార్యకర్తలకు తెలిస్తే రోడ్డుపై బట్టలూడదీసి కొడతారని హెచ్చరించారు.
రోజా చేపల పులుసుకు కేసీఆర్ న్యాయం
మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు, కానీ.. ఎంపీగా గెలిపించిన పాలమూరు ప్రజలను మాత్రం మోసం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే సాగర్ ప్రాజెక్ట్‌పైకి సీఆర్‌పీఎఫ్ బలగాలు వచ్చాయి. అప్పుడు సైలెంట్‌గా ఉన్న బీఆర్‌ఎస్ ఇప్పుడు మమ్మల్ని తప్పు పడుతోంది’. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. ‘వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టేనని గతంలో కేసీఆర్ అన్నారు. కానీ.. మేం అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని చెప్పాం. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చాం. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. కానీ.. ఆ నీళ్లు లేకున్నా రికార్డ్ స్థాయిలో ధాన్యం పండింది’ అని సీఎం తెలిపారు.