TG: తెలంగాణలో రోహిత్ వేముల చట్టం..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ... ఇప్పటికే చట్టం అమలు దిశగా కర్ణాటకలో అడుగులు;
తెలంగాణలో మరో కీలక చట్టం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. విద్యాసంస్థల్లో కులవివక్షను నియంత్రించేందుకు ‘రోహిత్ వేముల’ పేరిట చట్టాన్ని రూపొందించి... అమలు చేయాలని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ... తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి... లేఖ రాశారు. విద్యాసంస్థల్లో అందరినీ సమానంగా చూడాలనే లక్ష్యంతో రోహిత్ వేముల పేరు మీద చట్టం తేవాలని సూచించారు. విద్యావ్యవస్థలో నేటికీ బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కొంటున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే ‘రోహిత్ వేముల’ చట్టాన్ని రూపొందించి.. అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రికి సూచించారు. నేటికి మన విద్యావ్యవస్థలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఇటువంటి వివక్షను ఎదుర్కోవడం సిగ్గుచేటని రాహుల్ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జీవితంలో ఎదుర్కొన్న కుల
వివక్ష గురించి ఈ లేఖలో రాసుకొచ్చారు. వెనుకబడిన వర్గాల బిడ్డగా అంబేడ్కర్ ఎదుర్కొన్న కష్టాన్ని మరే బిడ్డా ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తారని నమ్ముతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు చూపిన వివక్షతో రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోయారని.. ఇటువంటి హత్యలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్ అన్నారు.
రాహుల్ ఆవేదన
ఏ స్థాయిలో విద్యార్థి అయినా కుల వివక్షకు గురైతే అది నిజంగా సిగ్గు చేటని రాహుల్ గాంధీ అన్నారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీ కులాలు ఈ తరహా కుల వివక్షను ఎదుర్కోనే వారిలో ముందు వరసలో ఉన్నారన్నారు. విద్యాస్థాయిలోనే కుల వివక్ష అధికంగా ఉందన్నారు. నవ సమాజంలో ఇప్పటికే లక్షల మంది కుల వివక్ష బారిన పడుతున్నారన్నారు.