SANKRANTHI: సంక్రాంతికి సిద్ధమవుతున్న ఆర్టీసీ
ఏపీకి 5వేల ప్రత్యేక బస్సులు... నగర శివార్ల నుంచే బస్సుల ఏర్పాటు... ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు
సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెల్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు, టీజీఎస్ ఆర్టీసీ అధికారులుతెలిపారు. ఈ పండుగకు 5వేలకుపైగాప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించిందన్నారు. ప్రధానంగా ఈ నెల 10, 11, 12 తేదిల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి స్తాయిలో చేసినట్టు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతుందన్నారు. ఇప్పటికే రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయాలు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సంక్రాంతి పండుగ కోసం నడిపే ప్రత్యేక బస్సుల కోసం రూ.1.50 వరకు టిక్కెట్ ధరలను పెంచుకునే అవకాశాన్ని ఇచ్చినట్టు ఆర్టీసీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏపీ, తెలంగాణ జిల్లాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందని రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు.
ఉత్తర తెలంగాణకు జేబీఎస్.. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్బీనగర్ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు చెప్పారు. సౌత్‌జోన్, సుల్తాన్ బజార్ రాజేంద్రనగర్ ఏసీపీలు కె.లక్ష్మణ్, కె.శ్రీనివాస్, డి.సుధీర్‌రెడ్డి, ఆర్టీసీ అధికారులు మహాంకాళి, ఎన్.జానకిరాం, ట్రాఫిక్ సీఐలు వి.మదన్‌లాల్, జి.బాలకృష్ణ పలువురు అధికారులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ వేళ విజయవాడ వెస్ట్ బైపాస్‌లో కాజ నుంచి గొల్లపూడి వరకు ఒకవైపు వాహనాలు పరుగులు పెట్టనున్నాయి. మొదట కార్లు, ద్విచక్ర వాహనాలను ఈ మార్గంలో వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. దీంతో గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఈ బైపాస్ మీదుగా నేరుగా గొల్లపూడి, అక్కడి నుంచి చిన్నఅవుటపల్లి మీదుగా ఏలూరు వైపు వెళ్లవచ్చు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాక్షికంగా ఒక వైపు వాహనాలు వెళ్లేలా చూడనున్నారు. వైస్ట్ బైపాస్‌లో భాగంగా కాజ-గొల్లపూడి మధ్య 17.88 కి.మీ, గొల్లపూడి-చిన్నఅవుటపల్లి మధ్య 30 కి.మీ. ఆరు వరుసల హైవే నిర్మాణం చేపట్టారు. ఇందులో గొల్లపూడి- చిన్నఅవుటపల్లి మధ్య నిర్మాణం పూర్తికాగా నవంబరు నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు.