SC: నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే "లోకల్"
స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మినహాయింపు... జీవో 33ను సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం... 9,10,11,12 తరగతులు చదివితేనే ఇక లోకల్
తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల స్థానికత అంశంపై కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా స్థానికత అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తెలంగాణలో వైద్య విద్య చదివాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ళ స్థానికత తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సమర్థించింది. తెలంగాణలో వరుసగా 9 ,10, 11,12 తరగతులు చదివితేనే లోకల్ అంటూ స్పష్టం చేసింది. ఈ రూల్స్ లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లోకల్ రిజర్వేషన్ అంశంపై తెలంగాణకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. స్థానికత అంశంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 33కి అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్థాయి మద్దతు తెలిపింది. గతంలో రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందే అన్న నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పు ప్రకారం.. రాష్ట్రంలోని మెడికల్ కోర్సుల్లో సీట్లు పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా స్థానికత నిబంధనలను పాటించాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రిజర్వేషన్ విధానం అమల్లో ఉంది. ఇది స్థానిక , స్థానికేతర విద్యార్థుల మధ్య సమాన అవకాశాలను కల్పించడానికి రూపొందించబడింది.
ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు
రాష్ట్ర విభజన తర్వాత తమ పిల్లలు మరో రాష్ట్రంలో చదవాల్సి వచ్చిందని అభ్యర్థుల తరపున పిటిషనర్లు వాదనలు వినిపించారు. ఇప్పటికే రాష్ట్రంలో లోకల్ కోటా పై జీవో 33 ను అమలు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విన్నవించింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు తప్పని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్నారని..దాంతో వాళ్ళ పిల్లలకు జీవో 33 నుంచి మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. రాష్ట్రప్రభుత్వం చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. కేవలం ఆల్ ఇండియా కోటా కింద లభించే 15 శాతం సీట్లకే అర్హులు అవుతారు. మిగిలిన 85 శాతం సీట్లు పూర్తిగా స్థానిక విద్యార్థులకే కేటాయించబడతాయి. సుప్రీంకోర్టు తీర్పుతో పెద్ద వివాదానికి తెర పడింది.