కంచ గచ్చిబౌలి అడవుల నరికివేతపై సుప్రీం కోర్టులో మరోసారి విచారణ జరిగింది. భూముల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు. అదే సందర్భంలో.. పర్యావరణ పరిరక్షణను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తే.. గతంలో చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటామని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తామన్నారు. సమగ్ర ప్రణాళిక తయారు చేసి కోర్టుకు అందించేందుకు తమకు ఆరు వారాలు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు సీజేఐ ధర్మాసనం అంగీకరించింది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అడవుల నరికివేతను సుమోటోగా విచారించిన సుప్రీం కోర్ట్... పర్యావరణాన్ని, వన్య ప్రాణులను రక్షించేలా ప్రతిపాదనలు రెడీ చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలోనూ కంచ గచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి కోసం రాత్రికి రాత్రి వందల బుల్డోజర్లతో అడవులను నాశనం చేస్తారా అంటూ సుప్రీం కోర్ట్ మండిపడింది.