SHEEPS SCAM: గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక మలుపు
ఆరుచోట్ల ఈడీ తనిఖీలు.. కీలక పత్రాలు స్వాధీనం..?;
గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్‌లోని ఆరుచోట్ల ఈడీ తనిఖీలు నిర్వహించింది. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, పలువురి ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గొర్రెల పంపిణీతో రూ.700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేల మంది లబ్ధిదారులకు సుమారు రూ.4వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో మొదటి నుంచి అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. కొంత మంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి, ఆ నిధుల్ని ఈ ముఠా స్వాహా చేసింది. ఈ నిధుల్ని బినామీ ఖాతాల్లోకి మళ్లించి అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు వెల్లడైంది. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ, ఈడీ అనుమానిస్తోంది.
ఈడీ అదుపులో తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్‌ను కొద్దిసేపటి క్రితం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కీంలో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కళ్యాణ్ ఇంటితో సహా హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్‌ను సుమారు 7 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసు గత ప్రభుత్వం హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కీంలో జరిగిన ఆర్థిక అక్రమాలకు సంబంధించినది కాగా... ఈ స్కీంలో రూ. 700 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లు ఏసీబీ ఆరోపించింది. కళ్యాణ్ కుమార్, తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ సీఈఓ సబావత్ రామ్‌చందర్‌తో కలిసి, నకిలీ లబ్ధిదారుల పేరిట భారీగా నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.