మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసులో డిస్మిస్ అయిన కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ ( SI Bhavani Sen ) వ్యవహారశైలి మొదటి నుంచే వివాదాస్పదంగా ఉంది. 2022లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతిని లైంగికంగా వేధించాడు. ఎత్తు, కొలతలు చూస్తానంటూ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లపైనా అత్యాచారం చేసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్‌ఐగా ఉన్న భవానీ సేన్ ఉదంతంపై జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఎస్టీపీవో సంపత్ రావుతో విచారణ చేయించారు. ముగ్గురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, భారీ బందోబస్తు మధ్య ఈ విచారణ చేసినట్టు సమాచారం.
ఎస్‌ఐ భవానీ సేన్ వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మంగళవారం రాత్రి 1.30 గంటల సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ అడిషనల్ జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని కరీంనగర్ జైలుకు తరలించారు.