SLBC: ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి తీరుతాం
రెండేళ్లలో పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి.. 30 లక్షల ప్రజలకు తాగునీరు అందిస్తాం.. ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టం
నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి వద్ద ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) మార్గదర్శకత్వంలో జరిగే ఈ హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే, భూగర్భంలో 1000 మీటర్ల లోతుల వరకు షియర్ జోన్లు, నీటి ప్రవాహాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల ప్రజానీకానికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులను రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. నిరంతరాయంగా సాగుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం కూలి.. 8 మంది సజీవ సమాధి అయినా నేపథ్యంలో నిలిచిపోయిన పనులను చేపట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, దేవరకొండ ఎమ్మెల్యే వాళ్లు నాయక్ తదితరులతో కలిసి టన్నెల్‌ను పూర్తి చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి హెలి మాగ్నెటిక్ సర్వే వివరాలను నిపుణులతో కలిసి పరిశీలించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రేవంత్ అన్నారు.
బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే...
‘‘ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు టన్నెల్ పనుల అంచనా విలువ రూ.1,968 కోట్లు. రెండు దశాబ్దాలుగా సాగుతున్న టన్నెల్ పనుల్లో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేనాటికి 30 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయింది. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో మిగతా 10కి.మీ టన్నెల్ పూర్తి చేయలేదు. పెద్దగా కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టారు. ఏపీలో జగన్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును విస్తరిస్తుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకున్నారు. రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలకు నీరు అందేది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురుద్దేశంతో పట్టించుకోలేదు. కృష్ణా నది మీద చేపట్టిన అన్ని ప్రాజెక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు.’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు 1983లో మంజూరైందని, ఇప్పటికీ పూర్తికాకపోవడం బాధాకరమని చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లెలో పర్యటించిన సీఎం.. హెలీ మాగ్నటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్, అధునాతన పరికరాలను పరిశీలించారు. టన్నెల్ బోర్ మిషన్‌తో పనులు చేయడం కష్టంగా మారిందని అన్నారు.