హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. అప్రమత్తమైన సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తి మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్డార్ ఆనంద్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఉద్యోగం విషయంపై మాట్లాడేందుకు వస్తే తనను అరెస్ట్ చేశారని డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను పోలీసులు రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో స్మితా సబర్వాల్ నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆనంద్ రెడ్డి అతడి స్నేహితుడితో కలిసి సబర్వాల్ నివాసానికి రాత్రి 11.30 గంటల సమయంలో వెళ్లాడు. స్మితా సబర్వాల్ క్వార్టర్ కు వెళ్లాలని జంకులేకుండా సిబ్బందికి చెప్పడంతో అనుమానించకుండా లోపలికి పంపారు. స్నేహితుడిని కారులోనే ఉంచి సబర్వాల్ ఇంట్లోకి ప్రవేశించాడు ఆనంద్ రెడ్డి.
అర్దరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి రావడంతో స్మితా సబర్వాల్ కంగారు పడ్డారు. ఎవరు నువ్వు, ఈ టైంలో ఇంట్లోకి ఎలా వచ్చావ్ అని ప్రశ్నించారు. తాను డిప్యూటీ తహసీల్దార్ ను అని చెప్పకుండా, గతంలో రెండు సార్లు ట్వీట్ చేశానని ఆనంద్ రెడ్డి చెప్పడంతో.. భయానికి గురైన సబర్వాల్ కేకలు వేసింది. భద్రతా సిబ్బంది తేరుకుని ఆనంద్ రెడ్డిని, కారులో ఉన్న అతని స్నేహితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు, ఆనంద్ రెడ్డితో పాటు అతని స్నేహితుడిని రిమాండ్ కు తరలించారు.
ఈ ఘటనపై స్మితా సబర్వాల్ స్పందించారు... సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు...
"అంత్యంత బాధాకరమైన అనుభవం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అర్థరాత్రి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను. రాత్రి వేల తలుపులను ప్రతీ ఒక్కరు స్వయంగా పరిశీలించుకోవాలి. అత్యవసర సరిస్థితులలో డయల్ 100కు ఫోన్ చేయాలి" అని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.