బోగస్ రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అర్హత లేనివారు, అధిక ఆదాయ వర్గాలు పొందిన తెల్ల రేషన్ కార్డుల ఏరివేతకు మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా బోగస్ తెల్ల రేషన్ కార్డులు ఏరివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని ప్రభుత్వ పథకాలకు తెల్ల రేషన్ కార్డులనే రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా పరిగణిస్తోంది. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికం చేయడంతో పేదలు, ధనికులు అని తేడా లేకుండా తెల్లరేషన్ కార్డులను పొందారు. రేషన్ సరుకులు పొందడం కంటే ఆరోగ్య శ్రీ చికిత్సలు, పిల్లలకు స్కాలర్షిప్, సబ్సిడీపై రుణాలు, విదేశీ విద్యా రుణం తదితర అవసరాలకే పెద్ద సంఖ్యలో తెల్ల రేషన్కార్డులను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో బోగస్ తెల్ల రేషన్కార్డులను ఏరివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.