Summer : తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. !
Summer : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు సుర్రమంటున్నాడు. ఉదయం నుంచే భానుడు విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.;
Summer : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు సుర్రమంటున్నాడు. ఉదయం నుంచే భానుడు విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. సన్‌స్ట్రోక్‌తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పగలు వడగాల్పులతో దడ పుట్టిస్తుంటే.. రాత్రిళ్లు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. దీంతో వేసవి ఆరంభంలోనే మండిపోతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్ల మార్చి ఉష్ణోగ్రతల్లో ఇదే కొత్త రికార్డు అని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇటు ఏపీలోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. విశాఖ, విజయనగరం, కర్నూలు, తిరుపతిలోనూ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తిరుపతిలో అత్యధికంగా 45 డిగ్రీలు నమోదుకావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు కనీసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడంలేదని స్థానికులు వాపోతున్నారు. ఇటు టీటీడీ ఆలయాల వద్ద చలువ పందిళ్లు వేయకపోవడంతో... భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.