Telangana News : అన్ని పార్టీల మద్దతు.. మరి ఎవరు వ్యతిరేకం..?

Update: 2025-10-18 08:01 GMT

తెలంగాణలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై పెద్ద రచ్చ జరుగుతుంది. నేడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బంద్ చేపట్టారు. ఈ బంద్ కు తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బిజెపి, ఇతర పార్టీలు అన్ని మద్దతు పలికాయి. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడం, అటు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేయడంతో వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. చట్టపరంగా 50 శాతం రిజర్వేషన్లు మించకూడదు అనే రూల్ తో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతో బీసీ సంఘాలు బంద్ ను చేపట్టాయి. అయితే ఈ బంద్ ఇప్పుడు ఎవరికి వ్యతిరేకం అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే తెలంగాణలోని అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి ఈ బంద్ కు.

అధికార కాంగ్రెస్ కూడా ఇందులో పాల్గొంటుంది. అలాంటప్పుడు ఈ బంద్ ఎవరిపై చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని రకాలుగా పోరాడుతుంది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి ఈ బంద్ కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది. మహారాష్ట్రలో తమ ప్రభుత్వమే ఉన్నా కూడా ఏం చేయలేకపోయామని.. ఈ విషయంలో తాము రాజకీయంగా సపోర్ట్ చేస్తామని చెబుతోంది. మరి అందరూ మద్దతు ప్రకటిస్తుంటే.. వ్యతిరేకంగా ఉన్నది ఎవరు. కోర్టు తీర్పులకు ఈ బంద్ వ్యతిరేకమా.. రాజ్యాంగ చట్టానికి ఈ బంద్ వ్యతిరేకమా.. లేదంటే కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు ఇది వ్యతిరేకమా. అన్ని పార్టీలు రాజకీయంగా మద్దతు ప్రకటిస్తున్నాయి తప్ప.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేది ఎవరు.

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఫలిస్తుందా అంటే ఫలించదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇది పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి తెలంగాణకు ప్రత్యేకంగా బిల్లు పాస్ కాదు. మరి అన్నీ తెలిసిన రాజకీయ పార్టీలు బంద్ లో ఎందుకు పాల్గొన్నాయి. రాజకీయంగా మద్దతు అంటున్నాయి తప్ప.. చట్టపరంగా వీలు కాదు అని ఎందుకు చెప్పలేకపోతున్నాయి. మధ్యలో బీసీలు ఎమోషన్ కావడమే తప్ప ఇందులో ఎవరికి లాభం. ఓవైపు హైకోర్టు స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు పెడతారని ప్రశ్నిస్తోంది. రెండు వారాల్లో ఏదో ఒకటి చెబుతామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఇలాంటి సమయంలో ఈ బంద్ వల్ల రిజర్వేషన్లు సాధ్యమవుతాయా అంటే కావు. ప్రభుత్వం పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కోర్టులు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు మరో ఆప్షన్ కూడా లేదు. కానీ పాత పద్ధతిలో వెళితే బీసీ సంఘాల నుంచి ఒత్తిడి తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు ముందుకు వెళ్లలేని పరిస్థితి. వెనక్కు వస్తే అన్ని రకాలుగా ఇబ్బందులు తప్పవు. మరి ముందున్న వ్యూహం ఏంటి.. ఈ బంద్ ఇంకా కొనసాగుతుందా ఈ ఒక్క రోజుతోనే ఆగిపోతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News